సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): అసలునోట్లకు తీసిపోకుండా అచ్చుగుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నెరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామానికి చెందిన కర్లి నవీన్‌కుమార్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా పూర్తి చేశాడు. ఆ తరువాత మల్టీమీడియాలో డిప్లమా చేసి గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగాలు చేశాడు, వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో 2025 ఆగస్టు వరకు ఉబర్, ర్యాపిడోలో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు.
అనుకున్న ఆదాయం రాకపోవడంతో అక్రమ దందాలతోనే ఈజీ మనీ సంపాదించవచ్చని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా నకిలీ కరెన్సీని తయారు చేసే విధానంపై ఆన్లైన్లో శోధన చేశాడు. తనకుకున్న మల్టీమీడియా పరిజ్ఞానంతో నకిలీ కరెన్సీని తయారు చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటర్నెట్తో పాటు ఇండియామార్ట్.కామ్‌లో 45 జీఎస్ఎం పేపర్ కోసం వెతుకుతుండగా కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారీ నవీన్‌ను సంప్రదించాడు. అలిబాబా.కామ్‌లో పేపర్ కోసం వెతకొద్దని, కావాలంటే నేను చేతితో తయారు చేసిన పేపరును పంపిస్తానంటూ ఆ పేపర్‌ను పంపించాడు. ఆ పేపర్‌తో మొదట రూ. 500 నోట్ నకిలీది తయారు చేసి కర్నూల్లో ఉండే తన స్నేహితుడికి పంపిచాడు.
అయితే అది అసలునోటు కాదని గుర్తుపట్టేలా ఉంది. దీంతో మరింత నాణ్యత, కచ్చితత్వం కోసం నోటు మధ్యలో ఉండే దారం కోసం ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలకు చెందిన వ్యక్తే ఆర్బీఐకి చెందిన దారం ఫైల్ అంటూ ఒక పార్సిల్‌ను నవీన్‌కు పంపించాడు. దానిని ఉపయోగించి తయారు చేసిన నకిలీ కరెన్సీ నోటు అచ్చం అసలు నోటులాగా ఉంది. దీంతో నకిలీ నోట్లు తయారు చేసి కొరియర్లో కోల్‌కతా, గుజరాత్, విజయవాడకు పంపిస్తున్నాడు. ఇండియన్ కరెన్సీతో పాటు యూఎస్ డాలర్లు వాటర్ షీటమ్మార్క్ షీట్స్ కూడా తయారు చేస్తున్నాడు.
అప్పటికే చిన్న ఫ్రింటర్ను ఉపయోగిస్తూ తక్కువ మొత్తంలో ప్రింట్ చేస్తున్నాడు. ఇంతలో కోల్‌కతా నుంచి గుజారాత్ నుంచి రూ. 25 లక్షల షీట్స్ కావాలని ఒకో షీట్‌కు రూ. 50 ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు వ్యక్తి వచ్చి నవీన్‌ను కలిసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న అడ్డాను చూశాడు. నకిలీ నోట్లు తయారు చేసే అడ్డా సరిగ్గా లేదని, క్వాలిటితో కూడి పెద్ద ప్రింటర్‌ను నవీన్‌కు సమకూర్చాడు.దీంతో తన అడ్డాను మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లికి మార్చాడు.
దీంతో రూ. 5 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు ప్రింట్ చేశాడు. ప్రింట్ చేసిన నకిలీ డబ్బును తుక్కుగూడలో ఆ నకిలీ నోట్ ఏజెంట్‌కు అందించేందుకు రావడంతో విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం ఎస్ఓటీ, పహాడీషరీఫ్ పోలీసులు నవీన్‌ను పట్టుకొని అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు దివిటిపల్లిలోని కిరాయి ఇంట్లోని అడ్డాలో తనిఖీ చేయగా భారీగా నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులు లభించాయి. కాగా రూ. లక్ష నకిలీ నోట్లు ఇస్తే రూ. 10 వేలు అసలు నోట్లు ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసు తదుపరి విచారణలో మిగతా నెట్వర్క్ బయటపడుతుందని సీపీ తెలిపారు.