కీసర, జూన్ 2: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర ఠాణా పరిధి రాంపల్లిలో గత 6 నెలల నుంచి 20కి ఫైగా ఫేక్ డాక్యుమెంట్ల కేసుల్లో 90 మంది అక్రమార్కులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమార్కులు దాదాపు రూ.120 కోట్ల విలువ చేసే ప్లాట్లకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ఇక్కడి భూములకు భలే డిమాండ్ ఉన్నది. కీసర మండల పరిసర ప్రాంతాల్లో తక్కువ రేట్లు ఉన్న సమయంలోనే ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది ప్లాట్లను కొన్నారు.
ఇది గమనించిన కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాళీగా కనిపించిన ప్లాట్లను కబ్జా చేశారు. ఈ క్రమంలో చాలామంది ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లు కబ్జాకు గురి అయ్యాయని కీసర పోలీస్‌స్టేషన్‌లో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయాన్ని కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్ర మం లో పోలీసుల దర్యాప్తులో 2016 నుంచి పెద్ద మొ త్తంలో నకిలీ డాక్యుమెంట్లతో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. అప్పటి ఎస్ఆర్ఓ రహమాన్ పనిచేసిన సమయంలోనే చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొంతమంది డాక్యుమెం ట్లు రైటర్స్, ఇతర బ్రోకర్లు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి నకిలీ పేపర్లు సృష్టించి ఎస్ఆర్తోపాటు మిగతా సిబ్బందికి భారీ మొత్తంలో లంచాలు ఇచ్చి డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారని అరెస్టు అయిన నిందితుల విచారణలో బయటపడింది.
చాలెంజ్‌గా తీసుకున్న సీఐ
రాంపల్లిలో వెలుగుచూసిన నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారాన్ని పోలీసు యంత్రాంగం బయటపెట్టడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కీసర పీఎస్‌లో నమోదైన కేసులను చాలెంజ్‌గా తీసుకున్న సీఐ ఆంజనేయులు.. కేవలం ఆరునెలల్లోనే 90 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. నమోదైన కేసులకు సంబంధించి స్థలాల విలువ ఓపెన్ మార్కెట్లో సుమారు రూ. 120 కోట్ల పైబడి ఉంటుందని పోలీసుల అంచనా.