బోడుప్పల్, అక్టోబర్ 27: వైద్య విద్యార్హతలు లేకున్నా.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల గుట్టురట్టు చేశారు తెలంగాణ వైద్య మండలి అధికారులు. నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలోని పలు దవాఖానలపై వైద్యమండలి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న క్వాలిఫైడ్ వైద్యులపై టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోడుప్పల్‌లోని ఆర్బీఎం దవాఖానలో అనస్థీషియా (మత్తు), కార్డియాలజీ (గుండె)డాక్టర్‌గా చెలామణి అవుతున్న డాక్టరు సుదర్శన్‌రావు గుండె స్కానింగ్‌తో పాటు యాంజియోగ్రామ్ చేసి.. గుండెకు స్టంట్లు సైతం వేస్తున్నారని తనిఖీలు నిర్వహించిన వైద్య బృందం తెలిపింది. డాక్టర్ సుదర్శన్‌రావుకు సంబంధించిన ఎలాంటి సర్టిఫికెట్స్ దవాఖానలో లేకపోవడం గమనార్హం. అదేవిధంగా.. విజయసెంటర్ హెల్త్ క్లినిక్ అనుమతిని డాక్టర్ వంశీ పేరిట తీసుకుని.. హోమియోపతి వైద్యుడు డాక్టర్ శంకర్ వైద్యం చేస్తున్నట్లు విచారణలో తేలిందని వైద్యాధికారులు తెలిపారు.
పీర్జాదిగూడ బుద్ధానగర్ మహాలక్ష్మి క్లినిక్‌కు డాక్టర్ రుషికేష్ పేరిట అనుమతి తీసుకుని.. నకిలీ వైద్యుడు సత్యనారాయణ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. హ్యాప్పీ చిల్డ్రన్స్ క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ పరమేశ్ మరో నకిలీ వైద్యుడు మహేశ్‌కుమార్‌తో కలిసి సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్యమండలి బృదం డాక్టర్లు సుకేష్ కుమార్, ప్రతిభాలక్ష్మి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ మేడ్చల్ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు.