సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పోలీస్ అని చెప్పుకుంటూ.. అమాయకులను మోసం చేస్తున్న ఒక నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ నిఖితా పంత్ కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్ కుమార్‌పై రెండు తెలుగు రాష్ర్టాలలో 18 కేసులు ఉన్నాయి. రెండు నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సృజన్ కుమార్ భార్య ఎస్సైగా పనిచేసింది. ఆమె మృతి చెందిన తరువాత.. ఆమె పోలీస్ డ్రెస్ ఫొటోలు, గన్ ఫొటోను ఫోన్లో సేవ్ చేసి పెట్టాడు.
నంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనంపై పోలీస్ అని రాసి తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే నెక్లెస్ రోడ్డులో తిరుగుతూ ఒంటరిగా ఉండే జంటలను టార్గెట్ చేశాడు. టార్చ్‌లైట్ వేసి.. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటూ బెదిరిస్తూ.. తాను పోలీసునంటూ దబాయించి.. వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అనంతరం ఈ విషయం పోలీస్‌స్టేషన్‌లో చెబితే మీ అంతుచూస్తానంటూ హెచ్చరించాడు. ఈ విధంగా.. గత నెల 9వ తేదీన నెక్లెస్ రోడ్డు బతుకమ్మ ఘాట్ వద్ద కారులో ఉన్న ఓ జంటను బెదిరించాడు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బాధితులు సెక్రటరియెట్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యిది. కేసు దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ. 1.38 లక్షల నగదు, బైక్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.