ఉప్పల్/ కాప్రా, జనవరి 20: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంధత్వ నిర్మూలన కార్యక్రమం ‘కంటి వెలుగు’కు కాప్రాసర్కిల్‌లో విశేష స్పందన లభిస్తోంది. సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటివెలుగు కేంద్రాల్లో మొదటి రోజున జరిగిన కంటి పరీక్షలకు మొత్తం 1320 మంది హాజరయ్యారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా కంటిపరీక్షలు చేయించుకున్నట్లు కంటి వెలుగు కేంద్రాల పర్యవేక్షకులు తెలిపారు.
మొదటి రెండు రోజుల్లో (గురు,శుక్రవారాలు) హస్తినాపురం (కాప్రా), భవానీనగర్, కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియా (ఏఎస్‌రావునగర్), నెహ్రూనగర్ (చర్లపల్లి), మంగాపురం (హెచ్‌బికాలనీ), బాబానగర్ (మల్లాపూర్), ఎర్రకుంట (నాచారం) కాలనీల వారికి కంటి పరీక్షలు నిర్వహిచినట్లు తెలిపారు.
ఉప్పల్ పరిధిలో.. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు కంటి వెలుగు కేంద్రాలలో పరీక్షలు రెండవరోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కాలనీవాసులు కంటి పరీక్షలకు హాజరై పరీక్షలు చేసుకున్నారు. ఉప్పల్ ఇందిరానగర్, చిలుకానగర్, బ్యాంక్‌కాలనీ, రామంతాపూర్ వార్డు కార్యాలయం, హెచ్‌బీకాలనీ రాజీవ్‌నగర్, అన్నపూర్ణకాలనీ, తదితర ప్రాంతాలలో 760 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 446 మందికి కంటి అద్దాలు అందజేశారు. కంటి పరీక్ష కేంద్రాలను ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ బోగ ప్రకాశ్ పరిశీలించారు. ఈమేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలు అందించేలా చూడాలని తెలిపారు.