Eye Diseases | సిటీ బ్యూరో, ఫిబ్రవరి17,(నమస్తే తెలంగాణ): ఆనందంగా గడపాల్సిన చిన్నారులు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. పసి వయసు నుంచే కంటి సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నారు. తరగతి గదిలో బోర్డుపై రాసే పదాలను కూడా గుర్తించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారుల్లో ఉన్న కంటి సమస్యలను గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే సోమవారం(ఫిబ్రవరి 17 నుంచి) నుంచి పదిహేను రోజుల పాటు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కళ్లజోడ్లు ఉచితంగా అందించనున్నారు.
పదివేల మందిని గుర్తించారు..
జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమికంగా స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సుమారు లక్షల మంది విద్యార్థులకు స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 10,000 మందికి కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వీరికి సోమవారం నుంచి పదిహేను రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోని గాంధీ, కింగ్‌కోఠి, నాంపల్లి, మలక్‌పేట ప్రాంతాల్లోని ఏరియా దవాఖానాలు, సరోజినీ దేవి కంటి వైద్యశాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రంలో వందమంది చొప్పున విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన కండ్ల అద్దాలను అందించనున్నారు. తొలిరోజు 500 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
కారణాలివే..
కంటి పరీక్షల్లో వీస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోషకాహారాలు తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ప్రభావం, ఎక్కువ సేపు చరవాణి వాడకం, టీవీ, ఫోన్‌ను తదేకంగా చూడటం వంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. అవగాహన అవసరం: డాక్టర్ వసంత, ఆర్బీఎస్కే మెడికల్ అధికారి, కింగ్‌కోఠి వైద్యశాల విద్యార్థుల్లో లోపిస్తున్న కంటి సమస్యలను తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల్లో విద్యార్థుల కండ్లు ఎర్రబడటం, దృష్టిలోపం వంటి సమస్యలను గుర్తించాం. వీళ్లకు మంచి ఆహారం, సమయానికి నిద్ర అత్యంత అవసరం.