మార్చి చివరి వారానికే పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
ఇప్పటికే 41 డిగ్రీలు నమోదు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
వృద్ధులు, పిల్లల ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
బస్తీ దవాఖానలతో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలు
సిటీబ్యూరో, మార్చి 31 : గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలుండటంతో వడదెబ్బ ప్రభావం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండేండ్లుగా కరోనా, లాక్‌డౌన్‌తో ప్రజలకు ఎండల ప్రభావం పెద్దగా తెలియలేదు. కానీ ఈ సారి మార్చి చివరి నుంచే ఎండలు దంచికొడుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా పగలు బయటకు తీసుకురావద్దని చెబుతున్నారు. వారు త్వరగా డీ-హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అధిక ఎండల వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. వేసవిలో తరచూ మంచినీరు తాగాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిదని చెప్పారు.
ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలు..
గ్రేటర్‌లోని అన్ని ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లను ముందు జాగ్రత్త చర్యగా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. బస్తీ దవాఖాన నుంచి జిల్లా దవాఖాన వరకు అన్ని స్థాయి ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక వైద్యసేవలను అందుబాటులో ఉంచాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డీఎన్ఎస్, ఎన్ఎస్ తదితర ఫ్లూయిడ్స్‌తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, యాంటీబయాటిక్స్ తదితర మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
పిల్లలను ఎండకు తీసుకురావద్దు
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. తీవ్రమైన ఎండలో పిల్లలను బయట తిరుగనిస్తే వాంతులు, విరేచనాలు ఏర్పడి వెంటనే డీ-హైడ్రేషన్‌కు గురవుతారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. అత్యవసరమైతే తప్పా పిల్లలను ఎండలో బయటకు తీసుకురాకూడదు. పిల్లలకు కాటన్ దుస్తులు వేయాలి. పిల్లలను ఉంచే గదులు చల్లగా ఉండే విధంగా జాగ్రత్తపడాలి.
– డాక్టర్ రమేశ్, చిన్నపిల్లల వైద్యనిపుణులు, నిలోఫర్ హాస్పిటల్
వడదెబ్బ నుంచి రక్షించుకోండి
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. తలకు రుమాలు కట్టుకోవాలి. ప్రతి 5 నుంచి 10నిమిషాలకు ఒకసారి నీరు తాగాలి. వడదెబ్బకు గురైన వారిని, ఎండలో తిరిగి మూర్చపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. ముఖంపై నీటిని చల్లి, స్పృహ వచ్చిన తరువాత నెమ్మదిగా కొంత చల్లటి మంచినీరు తాగించాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలి. ఎండలో వెళ్లేవారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదా మజ్జిగ, అంబలి వంటివి బాటిళ్లలో తీసుకెళ్లడం మంచిది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ గాంధీ దవాఖాన
గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్
మధ్యాహ్నం వరకే అత్యధికంగా 41డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానున్న ఎండలు
పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకోవడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఉన్నప్పటికీ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చి నెల చివరి రోజే నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రెండేండ్ల తరువాత గ్రేటర్లో మళ్లీ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2019లో అత్యధికంగా నగరంలో 43.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా గడిచిన రెండేండ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీల మధ్యనే నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, గాలులు వీస్తే గ్రేటర్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.