సిటీబ్యూరో: నార్త్ సిటీ మెట్రో సాధనలో మేడ్చల్ మెట్రో సాధన సమితి కీలక నిర్ణయం తీసుకున్నది. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణమే లక్ష్యంగా స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా మేడ్చల్ సాధన సమితి ఆధ్వర్యంలో… స్థానికంగా ఉండే కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను కలుపుకొని ఉద్యమ కార్యాచరణ వైపు అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన రాలేదు. దీంతో పాటు సెకండ్ ఫేస్-2లోనూ నార్త్ సిటీలోని ప్రతిపాదిత ప్రాంతాలను చేర్చలేదు. ఇలా తమ ప్రాంతానికి మెట్రో అంశంలో సీఎం రేవంత్రెడ్డి మొండిచేయి చూపుతున్నారు. ఒకసారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే.. భవిష్యత్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. దీనికోసం స్థానికులను భాగస్వామ్యం చేస్తూ మేడ్చల్ మెట్రో సాధన సమితి డిజిటల్ మాధ్యమాలు, స్థానికంగా కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రాంతానికి మెట్రో ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తోంది.
వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం..
మేడ్చల్, శామీర్పేట వరకు మెట్రో నిర్మాణమే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. నార్త్సిటికీ మెట్రో సాధన ప్రాముఖ్యతను వివరిస్తూ ఇప్పటికే పలు కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలను చేపట్టింది. తాజాగా మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో కాలనీకొక కమ్యూనిటీని ఏర్పాటు చేస్తోంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు ఉన్న కాలనీ వాసులను కలుపుకొంటున్నది. కమ్యూనిటీ బిల్డప్ పేరిట ఇంటింటికీ నార్త్ సిటీ మెట్రో ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో భాగమని మెట్రో సాధన సమితి నిర్వాహకులు చెబుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి గెలిచిన తర్వాత… ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పునర్జీవం పోసిన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తానన్నారు. కానీ సీఎం అయ్యాక ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైన మెట్రో నిర్మాణంలో మొండి చేయి చూపారు. ఫేస్-2లో భాగంగా నగరంలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసింది. కానీ ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నా స్థానికుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే అలైన్మెంట్లను ప్రకటించింది. ఇందులో నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రైట్ ఆఫ్ వే లేదనే సాకుతో మేడ్చల్ ప్రాంతానికి మెట్రోను దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్థానికులు వాపోతున్నారు.