దుండిగల్, ఫిబ్రవరి 19 : దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు అన్వేషణ-2023 పోటీల్లో సత్తా చాటారు. ఇటీవల ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు చెందిన బీటెక్ ఈసీఈ విభాగం విద్యార్థులు మహ్మద్ ఖాదర్‌పాషా, కోమటి సతీశ్‌లతోపాటు దుండిగల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అయేషా, 9వ తరగతి విద్యార్థి శివానిలతో కలిసి ‘బ్రెయిన్ కంట్రోల్ వీల్‌చైర్’ను రూపొందించారు.
ఈ పోటీల్లో దీనికి మొదటి బహుమతి దక్కింది. నిర్వాహకులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.30వేల నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కళాశాలకు చెందిన ఈసీఈ విభాగం విద్యార్థులు కల్యాణ్‌రెడ్డి, విశ్వతేజ జడ్పీహెచ్ఎస్ స్కూల్ దుండిగల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులతో కలిసి ‘క్రాప్ డెయిర్’ను రూపొందించారు. దీనికి ప్రశంసాపత్రంతోపాటు కన్సోలేషన్ బహుమతిగా రూ.5వేలు అందుకున్నారు.
వీల్‌చైర్ ప్రాముఖ్యత..
ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న 600 మిలియన్లకు పైగా మంది వీల్చైర్లను వినియోగిస్తున్నారు. ఇందులో మాన్యువల్ నియంత్రణ, జాయ్‌స్టిక్ నియంత్రణ, వాయిస్ నియంత్రణ వంటి వీల్చైర్లు వాడుకలో ఉన్నాయి. అయితే ఇలాంటి వీల్చైర్లను నియంత్రించలేని వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయంగా సరికొత్త వీల్‌చైర్‌ను రూపొందించారు ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థులు. ప్రతిపాదిత మోడల్ వీల్‌చైర్ అది. వినియోగించే వ్యక్తి మెదడు యొక్క ఈసీజీ సిగ్నల్స్ ద్వారా పని చేస్తుందన్నారు. దీనికి మ్యాన్‌పవర్ అవసరం కూడా లేదని, ఆపరేట్ చేయడం కూడా సులభమని స్పష్టం చేశారు. పక్షవాతం రోగులకు, కాళ్లు తీవ్ర గాయాలకు గురైన వ్యక్తులతోపాటు వెన్నుపూస గాయపడిన వారికి కూడా ఇది ఎంతగానో ఉపకరిస్తుందని వివరించారు.
నూతన ఆవిష్కరణలు రూపొందించేలా ప్రోత్సాహం
కళాశాల సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాలలో నాణ్యమైన సాంకేతిక విద్యతోపాటు విద్యార్థులు తమ ఆలోచనలకు పదునుపెట్టి సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ డా.కె.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. అన్వేషణ-2023లో తమ విద్యార్థులు సత్తాచాటడం గర్వంగా ఉందని, మున్ముందు మరిన్ని విజయాలు సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ విభాగం అధిపతి డాక్టర్ ఎస్వీఎస్.ప్రసాద్, కో-ఆర్డినేటర్ రాజునాయక్లను అభినందించారు.