హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిర్లిప్తతతో ఉంటే తీరని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు మాకెందుకులే అనుకుంటే మొదటికే మోసం వస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ప్రకియలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)తో పాటు బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర కూడా కీలకం. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ‘సర్’ ప్రక్రియను అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడంలేదు. ఇదేదో బీఎల్వోల పని అనుకొని పట్టించుకోవడంలేదు. బీఎల్ఏలను రంగంలోకి దించడంలేదు. ఇది అత్యంత ప్రమాదకరమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘సర్’ను తాము నిర్లక్ష్యం చేశామని, పట్టించుకోలేదని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందంటూ డీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పిన మాటలను ఉదహరిస్తున్నారు.
గతంలో జరిగిన ఓ ఎన్నికల్లో ఓ నేతకు రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ ఆయనే గెలుస్తాడని ఢంకా బజాయించాయి. కానీ, రోజు రోజుకూ పరిస్థితులు మారిపోయాయి. మరీ ముఖ్యంగా పోలింగ్‌కు ముందు పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఓ పెద్దనేత డేంజర్లో ఉన్నావని అప్రమత్తం చేసినా.. సదరు అభ్యర్థి అతి విశ్వాసానికి పోయారు. తుదకు బొక్కబొర్లాపడ్డాడు. తృటిలో ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతే. పొలిటికల్ చాప్టర్ క్లోజ్. సీన్ కట్‌చేస్తే అదే స్థానంలో మరో నేత రంగ ప్రవేశం చేశాడు. టికెట్ ఎగరేసుకొనిపోయాడు. ఆఖరికి నామినేటెడ్ పోస్టుల్లోను అవకాశం రాలేదు. చివరికి నామమాత్రపు కమిషన్‌లో సభ్యుడి హోదాతో సరిపెట్టుకున్నాడు. ఇంతకు ఆయన ఓడిన తేడా రెండు వేల ఓట్ల లోపే. ఓ వెయ్యి ఓట్లు సాధిస్తే ఆయన జీవితమే మారిపోయేది. ఎమ్మెల్యేగా చరిత్రకెక్కేవాడు. ఇది కథ కాదు. కట్టు కథ కానేకాదు. 2009 ఎన్నికల్లో మన రాష్ట్రంలో జరిగిన వాస్తవం. ఇలాంటి వారెందరో తక్కువ తేడాతో ఓడిపోయారు. ఇది ఓట్లకున్న విలువ. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో సందేశ్ సెగ్మెంట్లో 27వేల ఓట్లను ‘సర్’తో తొలగించగా, ఈ స్థానంలో జేడీయూ కేవలం 27 ఓట్లతో గెలిచింది. కుర్హాని నియోజకవర్గంలో ‘సర్’లో భాగంగా 24 వేల ఓట్లు తొలగించగా, ఈ స్థానంలో బీజేపీ 9 వేల ఓట్లతో గెలిచింది.
‘సర్’ను రాజకీయ పార్టీల నేతలు అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు. దీనిపై అంతగా దృష్టిపెట్టడంలేదు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగనున్నది. దీంతో నియోజకవర్గాల స్వరూపం మారనున్నది. రిజర్వేషన్లు మారిపోతాయి. మహిళా రిజర్వేషన్లతో ఏ సీటు ఎవరికి రిజర్వు అవుతుం దో తెలియని పరిస్థితులున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఈ జంజాటం మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పట్టించుకోవడంలేదు. ఇదిలాఉంటే, ‘సర్’ ప్రక్రియలో క్యాడర్‌ను నిమగ్నం చేసేందుకు ఎంతో కొంత ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే అనవసర ఖర్చులెందుకులే అన్న భావన నాయకుల్లో కనిపిస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో ఈ కారణంతోనే ‘సర్’ ప్రక్రియ ఒక్క బీఎల్వోల బాధ్యతగా మారిపోయింది.
మొన్నటికి మొన్న పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీని ‘సర్ దారుణంగా దెబ్బతీసింది. 90 లక్షలకుపైగా ఓట్లను తొలగించడంతో దీదీ కంచుకోటలు బద్దలయ్యాయి. మమతా ఓటు బ్యాంక్ గల్లంతయ్యింది. ఓట్లు తొలగించిన ప్రాంతాల్లో దీదీ నిలిపిన అభ్యర్థులు పరాజయం కాగా, బీజేపీది పైచేయి అయ్యింది. అనేక నియోజకవర్గాల్లో టీఎంసీ డీలా పడగా, బీజేపీ భారీగా లబ్ధిపొందింది. బెంగాల్లో 25 వేలకుపైగా ఓట్లు తొలగించిన నియోజకవర్గాలు 147 ఉంటే, బీజేపీ 95 గెలిచింది. తృణమూల్ 51 స్థానాలకే పరిమితమైంది. 15 వేల నుంచి 25 వేల ఓట్లు తొలగించిన నియోజకవర్గాలు 67 ఉంటే, దీంట్లో బీజేపీ 47 స్థానాలు గెలిస్తే, టీఎంసీ 19 స్థానాలు మాత్రమే గెలుచుకున్నది. ఐదు వేల నుంచి 15 వేల ఓట్లు తొలగించిన స్థానాలు 62 ఉంటే, బీజేపీ ఏకంగా 50 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఐదు వేల లోపు ఓట్లు తొలగించిన స్థానాలు 13 ఉంటే మొత్తం స్థానాలను బీజేపీ ఖాతాలో వేసుకొన్నది.
‘సర్’ ప్రభావం తమిళనాడు, బీహార్‌లోనూ స్పష్టంగా కనిపించింది. తమిళనాడులో ఏకంగా 97 (15.2%) లక్షల ఓట్లు తొలగించారు. ఒక్క చెన్నైలోనే 15 లక్షల ఓట్లు తొలగించారు. 168 నియోజకవర్గాల్లో 10% ఓట్లకు కోతపడింది. మొత్తంగా బీజేపీకి గట్టి విపక్షంగా పేరున్న డీఎంకే దారుణ ఓటమి చవిచూసింది. బీహార్‌లో ‘సర్’ ప్రక్రియలో అత్యధిక ఓట్లు తొలగించిన ఐదు నియోజకవర్గాల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. 174 సీట్లల్లో గెలుపు మార్జిన్.. తొలగించిన ఓట్ల కంటే తక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 91 సీట్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి చేతులు మారాయి. వీటిలో 75 సీట్లను ఎన్డీఏ గెలిచింది.
‘సర్’ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఊపందుకున్నది. ఈ నెల 24 వరకు అవకాశముంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆశావాహులు అప్రమత్తం కావాల్సిన తరుణమిదే. బీఎల్ఏలను రంగంలోకి దింపాల్సిన సయమిదే. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఓటర్లకు అవగాహన కల్పించాలి. ఓటు బాధ్యతని గుర్తుచేయాలి. అందరికీ ‘సర్’ ఫారాలు అందేలా చూడాలి. అర్హులైన ఓటర్లు ఈ ఫారాలు నింపేలా చూడాలి. ఓట్లు తొలగించకుండా జాగ్రత్తపడాలి. అర్హులవి తొలగిస్తే అప్పీల్ చేయాలి. తగు డాక్యుమెంట్లు సమర్పించాలి. అలా అని అనర్హుల ఓట్లు ఉండకుండా చూసుకోవాలి. చనిపోయిన వారు, రెండు ఓట్లు ఉన్నవి ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు పాటుపడాలి.