బంజారాహిల్స్,సెప్టెంబర్ 1: తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రవేశించిన దొంగ ఖరీదైన వజ్రాభరణాలు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నివాసం ఉంటున్న వ్యాపారి శైలేందర్ సింగ్ ఇంట్లోకి సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆగంతకుడు ప్రవేశించాడు. కప్‌బోర్డులో దాచిన ఎమరాల్డ్ వజ్రపు ఉంగరం, రెండు బ్రాస్లెట్స్, నెక్లెస్, చెవి కమ్మలు, ఎమరాల్డ్ నెక్లెస్, మరో బంగారం నెక్లెస్‌తో పాటు మరిన్ని ఆభరణాలు తస్కరించి బయటకు వెళ్లాడు.
ఉదయం నిద్రలేచిన తర్వాత చోరీ జరిగిన విషయాన్ని గమనించిన శైలేందర్ సింగ్ సతీమణి నీలూ కౌర్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రైం పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల నేపాల్ గ్యాంగ్స్ చోరీల నేపథ్యంలో ఈ కేసులో సైతం బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.