GHMC | సిటీబ్యూరో/అమీర్‌పేట, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : వీధి వ్యాపారుల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడిచింది. వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు సాగించుకునేందుకు అవకాశం కల్పించాల్సిన అధికారులు ..అనర్హులకు కొమ్ముకాస్తున్నారు. వీధి వ్యాపారులకు ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాల్సిన చోట కొందరు అధికారులు రాజకీయ నాయకులకు దాసోహం అవుతున్నారు. ఫలితంగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా అన్హరులు, అధికారులు కలిసి అక్రమ దందాకు తెరలేపారు. సనత్‌నగర్ ప్రధాన రహదారి కేంద్రంగా స్ట్రీట్ వెండర్ జోన్ అక్రమార్కులకు అడ్డంగా మారింది. వీధి వ్యాపారులతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు చేతుల్లో ఈ దందా మూడు పువ్వులు-ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్నది.
వీధి వ్యాపారుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ సనత్‌నగర్ ప్రధాన రహదారిలోని పారిశ్రామికవాడ పార్కు ప్రహరీకి ఆనుకుని 18 స్టాళ్లను నిర్మించి ఇచ్చింది. అప్పట్లో ఈ స్టాళ్లు స్ట్రీట్ వెండర్ కార్డులు కలిగి ఉన్న వారికే మంజూరైనా.. మారిన పరిస్థితుల్లో క్రమంగా ఈ స్టాళ్లు వీధి వ్యాపారాలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
అడ్డదారుల్లో స్ట్రీట్ వెండర్ కార్డులు దక్కించుకున్న వారి చేతుల్లోకి స్టాళ్లు వచ్చి చేరాయి. అయితే తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారి కోసం కేటాయించిన ఈ షాపుల్లో ఇతర వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ కోర్ట్స్, ఫర్నిచర్ షాపులు వంటివి దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడి స్టాళ్ల నిర్వహణకు విద్యుత్‌తో అవసరం ఉండదు. అయినప్పటికీ స్టాళ్ల నిర్వాహకులు తమ పలుకుబడితో ఇక్కడ రెండు విద్యుత్ మీటర్లను సాధించుకోవడం గమనార్హం.
అడ్డదారుల్లో స్టాళ్లను దక్కించుకున్న పలువురు నాయకులు, వారి శిష్య బృందాలు వీటిని సొమ్ము చేసుకునే పనుల్లో పడ్డారు. ఈ స్టాళ్లను సొంతం చేసుకున్న వారిలో ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న వారే ఎక్కువ. సమాజంలో బిగ్ షాట్లుగా గుర్తింపు ఉన్న ఇద్దరు ముగ్గురు సైతం తమ వద్ద ఉన్న స్ట్రీట్ వెండింగ్ కార్డులతో ఇక్కడ స్టాళ్లు దక్కించుకున్నారు. ఇక ఏటా ఈ స్టాళ్లు నెలకొన్న స్థలంలోనే సనత్‌నగర్ క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున తమ దుకాణాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ పటాకుల దుకాణాల ఏర్పాటుతో పాటు వ్యాపారాలకు కొత్తగా నిర్మించిన స్టాళ్లు, వారి ఆధీనంలో ఉన్న ఫుట్‌పాత్‌లు అడ్డంకిగా మారాయి.
దీంతో క్రాకర్స్ దుకాణాల నిర్వాహకులు ఏకంగా స్టాళ్లతో సహా మొత్తం ఫుట్‌పాత్‌లను వారం రోజుల పాటు తమ వ్యాపారాల కోసం పెద్దమొత్తంలో చెల్లించి అద్దెకు తీసుకుంటారు. ఆ వారం రోజుల పాటు ఈ స్టాళ్ల వ్యాపారులు అక్కడ కనిపించరు. ఇక ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే ఎర్రగడ్డ సంతలో జీహెచ్ఎంసీ స్టాళ్లు దక్కించుకున్న వారికి బాగా కలిసి వస్తున్నది.ఈ 18 స్టాళ్లున్న పరిసరాలు, ఫుట్‌పాత్‌లను సంతలోని వ్యాపారులు ఆదివారం మొత్తం వారి ఆధీనంలోకి తీసుకుంటారు. ఇందుకు కూడా వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ సనత్‌నగర్‌లో నిర్మించిన 18 స్ట్రీట్ వెండింగ్ స్టాళ్లను ఇప్పటికైనా అసలైన వీధి వ్యాపారులకు కేటాయించాలనే డిమాండ్ పెరుగుతున్నది.
నిరంతరం వ్యాపారాలు చేసుకునే జోన్లు (గ్రీన్ జోన్), పాక్షికంగా ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే వ్యాపారాలు చేసే జోన్లు (యాంబర్ జోన్), వ్యాపారాలు నిషేధించిన జోన్లు (రెడ్ జోన్)గా ఎంపిక చేస్తున్నారు… స్ట్రీట్ వెండర్స్గా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. తోపుడు బండ్ల నిర్వాహకులు, ఎలక్ట్రిషీయన్లు, రోడ్ల వెంబడి దుకాణాలు, చేపలు, పండ్ల వ్యాపారాలు, టైలరింగ్ తదితర వ్యాపారులను అర్హులుగా గుర్తించి.. వారికి రూ.10వేల రుణం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాపారుల్లో ఎక్కువ శాతం చదువుకోని వారు ఉండడంతో వారి వ్యాపారాభివృద్ధికి జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం అధికారులు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు.