అబిడ్స్, డిసెంబర్ 31 : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఒమిక్రాన్ వేరియెంట్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం ప్రారంభమవుతుందని జాయింట్ పోలీస్ కమిషనర్, సెంట్రల్‌జోన్ డీసీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అగ్నిమాపక, ఎలక్ట్రికల్, జీహెచ్ఎంసీ తదితర శాఖలు అనుమతులు ఇచ్చాయని, వీటి ఆధారంగా ఎగ్జిబిషన్ సొసైటీకి నిర్వహణ కోసం అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే నుమాయిష్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయా రాష్ర్టాల నుంచి సందర్శకులు వచ్చే అవకాశం ఉండటం.. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పకుండా పాటించేలా చూడాలని నిర్వాహకులకు సూచించినట్లు చెప్పారు. సందర్శకులు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు.
4 నుంచి 6 గంటల వరకు టెస్టులు, వ్యాక్సిన్
ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారని, కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మెట్రో రైళ్ల వేళలు పెంచడం, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆయా శాఖలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా అగ్నిమాపకశాఖ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశారని, వాటన్నింటిని పరిశీలించామని చెప్పారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్య మార్గం, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ధీరజ్ జైస్వాల్, సభ్యులు వినయ్‌కుమార్, అశ్విన్ మార్గం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించనున్న గవర్నర్, మంత్రులు
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శనివారం సాయంత్రం ప్రారంభిస్తారని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యమార్గం తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు.