హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు శుక్రవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు పబ్బులపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఏక కాలంలో 25 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన సోదాల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. మొత్తం 130 మంది అనుమానితులను డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.
జీరో 40 బ్రేవ్స్లో ఐటీ ఉద్యోగి, రియల్టర్, విస్కీసాంబా పబ్‌లో డీజే ఎంప్లాయ్, స్టూడెంట్, జరా పబ్‌లో ఓ ఉద్యోగి, క్లబ్ రోగ్ పబ్‌లో విజయవాడకు చెందిన ఓ యువతికి పాజిటివ్ రాగా కేసులు నమోదు చేసి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్ కిషన్, అదనపు ఎస్పీ భాసర్, డీఎస్పీలు మనోహర్‌రావు, తిరుపతియాదవ్, టీజీ న్యాబ్ సీఐలు రాజశేఖర్, సంతోష్‌కుమార్, ఎస్సైలు వెంకట్, వెంకటరమణ పాల్గొన్నారు.