సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): కొండాపూర్‌లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు తెలి పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు కథనం ప్రకారం.. ఏపీలోని మంగళగిరి ప్రాంతానికి చెందిన అప్పికట్ల అశోక్ నాయుడు వృత్తిరీత్యా పందెం కోళ్ల ఫామ్ నిర్వహిస్తాడు.
సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాల నిర్వాహకులకు ఖరీదైన పందెం కోళ్లను లక్షల్లో విక్రయిస్తాడు. అంతే కాకుండా సంపన్న వర్గాలకు చెందిన యువతీ యువకులు, వ్యాపారులు, కొందరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు డ్రగ్స్‌తో కూడిన రేవ్ పార్టీలను నిర్వహిస్తాడు. అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, ఈ రేవ్ పార్టీల్లో పాల్గొనే వారికి. సరఫరా చేస్తాడు. వీరితో పాటు ఉన్నతి ఇమాన్యుయల్ అలియాస్ అనిల్ అలియాస్ ప్రవీణ్‌కుమార్ సైతం డ్రగ్స్ సరఫరా చేస్తాడు.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో ఏపీలోని విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన సమ్మెల సాయికృష్ణ, నాగెల్ల లీలా మణికంఠ, హిల్టన్ జోసెఫ్, అడప యశ్వంత్ శ్రీదత్తు, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజ్‌లతో కలిసి రాహుల్, అశోక్‌నాయుడు, ఇమాన్యుయల్ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున పలు రకాల డ్రగ్స్‌ను వినియోగించారు.
అంతే కాకుండా యువతులను సైతం రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 9మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.5లక్షల విలువ చేసే 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుశ్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్, 4-ఎల్ఎస్డీ బ్లాట్ పేపర్స్ తదితర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా నిందితులు వినియోగించిన సుమారు రూ.75లక్షల విలువ చేసే 6 ఖరీదైన కార్లు, 11 సెల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కాగా నిందితులకు డ్రగ్స్, రేవ్ పార్టీకి సంబంధించి ఇతర ఏర్పాట్లు చేసిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ చౌదిరి అలియాస్ వాసు, అఖిల్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు తెలిపారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ సరఫరా చేసే రాహుల్‌పై గతంలో కూడా మూడు కేసులు నమోదై ఉన్నట్లు ఈఎస్ ప్రదీప్‌రావు వెల్లడించారు. రేవ్ పార్టీ నిర్వాహకుడు అశోక్‌పై సైతం గతంలో ఒక కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో ఎంపీ బంధువు?
రేవ్ పార్టీలో పట్టుబడిన నిందితుల్లో ఒకరు ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ బంధువు ఉన్నట్లు సమాచారం. అయితే రేవ్ పార్టీ నిర్వాహకుడైన అశోక్ నాయుడుకి చెందిన కారుపై పార్లమెంట్ సభ్యుడి స్టిక్కర్ కూడా ఉండటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
తప్పించుకున్న యువతులు..
రేవ్ పార్టీలో 8 మంది యువతులను సైతం రప్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాని వారు వచ్చే లోపే ఆబ్కారీ అధికారులు దాడులు జరపడంతో యువతులు తప్పించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఫామ్‌హౌస్‌లపై నిఘాతోనే..
ఈ మధ్య కాలంలో అటు పోలీసులు, ఇటు ఆబ్కారీ అధికారులు తరచూ ఫామ్‌హౌస్‌లపై దాడులు జరుపుతుండడంతో నిర్వాహకులు ఎవరికీ అనుమానం రాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. గెట్ టు గెదర్ ముసుగులో యువతీ, యువకులతో గుట్టు చప్పుడు కాకుండా ప్రతి వీకెండ్లో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో నిందితులు పెద్ద ఎత్తున రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.