సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నగరంలోని తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.1.26కోట్ల విలువ చేసే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సోమవారం ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డివిజన్లోని అమీర్ పేట్, ధూల్ పేట్ , గోలొండ, జూబ్లీహిల్స్, కాచిగూడ, మలక్ పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 102 కేసుల్లో 171.34 కిలోల గంజాయి, 21.03కిలోల గంజాయి చాక్లెట్లు, 20 కిలోల గాంజాతో తయారు చేసిన కుల్ఫీ, 320.6 గ్రాముల హాషీశ్ అయిల్ , 51గ్రాముల ఓజీ కుశ్, 17.66 గ్రాముల ఎండీఎంఎ,12 గ్రాముల కొకైన్ పట్టుబడినట్లు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్, డ్రగ్ డిస్పోజల్ అధికారి కే.ఏ.బీ శాస్త్రీ తెలిపారు.
ఈ మొత్తం మత్తు పదార్థాల విలువ రూ. 1.26 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ మత్తుపదార్థాలను ప్రభుత్వ అనుమతి పొందిన జీజే మల్టీకౌవ్ ప్రై.లిలో దహనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏఈఎస్‌లు శ్రీనివాసరావు, మోహన్‌బాబు, సం బంధిత ఎక్సైజ్ స్టేషన్ సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ధూల్‌పేట్, అమీర్ పేట్లో ..
నగరంలోని ధూల్ పేట్, అమీర్ పేట్ ఆబ్కారీ స్టేషన్ల పరిధిలో సోమవారం ఎస్టీఎఫ్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1.162 కిలోల గంజాయి, 6 ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, 2 ఎల్ఎస్డీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూల్ పేట్‌కు చెందిన సోనియా బాయి తన ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు ఆమె నివాసంపై దాడులు చేశారు. గంజాయి పట్టుబడటంతో నిందితురాలిని అరెస్టుచేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న సతీశ్ పాల్ సింగ్ అలియాస్ గిద్దా సతీశ్‌పై కేసునమోదు చేశారు.
అమీర్‌పేటలో.. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన శోభన్, ప్రజ్ఞ అనే వ్యక్తులు నగరంలో డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అమీర్‌పేట పరిసర ప్రాంతాల్లో ఎల్ఎస్డీ బ్లాస్ట్‌ను విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు సోమవారం నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 ఎల్ఎస్డీ బ్లాస్ట్స, 2 ఎల్ఎస్డీడీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో..
గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన టమాట సంజయ్, శివసింగ్, జ్వాలాదీపాంశ్కుమార్, రావుల నరేశ్ గంజాయి తాగడమే కాకుండా విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి 3.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం అరకులో ఉండే సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర గంజాయి తెచ్చి యాప్రాల్, బాలాజీ నగర్, అల్వాల్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుబ్బారావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.