సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/ మొయినాబాద్: బర్త్‌డే పార్టీ ముసుగులో డ్రగ్స్ తీసుకున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను ఆబ్కారీ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే 0.50గ్రాముల ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, 20.21గ్రాముల హషీష్ ఆయిల్, అనుమతి లేని ఐదు మద్యం బాటిళ్లతో పాటు రూ.50లక్షల విలువ చేసే మూడు కార్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఎస్టీఎఫ్ సీఐ భిక్షపతి కథనం ప్రకారం…నగరానికి చెందిన అభిజిత్ బెనర్జీ, డింపుల్, ప్రతాప్, గోయల్, జస్వంత్, దినేశ్‌లు డెల్ కంపెనీలో ఐటీ ఉద్యోగులు. అయితే అభిజిత్ బెనర్జీ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ అనే ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఆదివారం ఫామ్‌హౌస్ లో బెనర్జీ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నా డు.
అయితే ఈ వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం వినియోగించడంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను కూడా వినియోగించారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ సీఐ భిక్షపతి, ఎస్ఐ బాల్‌రాజు బృందంతో కలిసి సదరు ఫామ్‌హౌజ్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో డ్రగ్స్ వినియోగించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 0.50గ్రాముల ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, 20.21గ్రాముల హషీస్ ఆయిల్‌తో పాటు రూ.50లక్షల విలు వ చేసే మూడు కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అంతే కాకుండా డ్రగ్స్ వినియోగానికి అనుమతి ఇచ్చిన ఫామ్‌హౌస్ నిర్వాహకుడిపై కూ డా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా డ్రగ్స్ పార్టీ ఇచ్చిన ప్రధాన నిందితుడైన అభిజిత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసు ఛేదించిన ఎస్టీఎఫ్ సీఐ భిక్షపతి, ఎస్ఐ బాలరాజు బృందాన్ని ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిం అభినందించారు.
కొత్తపేటలో డ్రగ్స్, గంజాయి స్వాధీనం..
ఉప్పల్ కొత్తపేట ప్రాంతం, మారుతీ నగర్‌లోని భరత్, రిషబ్‌ల ఇళ్లలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 13.65 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌తోపాటు 513 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. ఈ మేరకు భరత్, రిషబ్‌లను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఉప్పల్ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.