సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): కల్లు ప్రియుల ప్రాణాలకు హాని కలిగించే మత్తు మందుతో తయారు చేసిన కల్తీ కల్లుపై రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫాజోలం విక్రయదారులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అల్ఫాజోలం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.6.5లక్షల విలువ చేసే 615గ్రాముల ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ కథనం ప్రకారం…అత్తాపూర్ ప్రాంతానికి చెందిన శివరాజ్ గౌడ్ గ్రేటర్‌లోని పలు కల్లు కంపౌండ్లకు ఆల్ఫాజోలం విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు శనివారం అత్తాపూర్, రాధాకృష్ణానగర్ లోని శివరాజ్‌గౌడ్ నివాసంపై దాడులు జరిపారు.
ఈ దాడిలో నిందితుడి ఇంట్లో నుంచి రూ.6.5లక్షల విలువ చేసే 615గ్రాముల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకుని, శివరాజ్గౌడ్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ మత్తు పదార్థాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న కల్లు కంపౌండ్లకు విక్రయించాలంటూ షాద్‌నగర్‌కు చెందిన వెంకటయ్యగౌడ్ సూచించగా సరఫరా చేసినట్లు పట్టుబడిన నిందితుడు అధికారుల విచారణలో వెల్లడించాడు.
దీంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంకటయ్యగౌడ్పై కూడా కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసేందుకు వేట మొదలు పెట్టారు. ఇదిలా ఉంగా ఆల్ఫాజోలం కేసును ఛేదించిన ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్‌తో పాటు సీఐ సుభాష్‌చంద్ర, ఎస్సైలు వెంకటేశ్, అఖిల్ కుమార్ల బృందాన్ని ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ కిషన్‌లు అభినందించారు.