మారేడ్‌పల్లి, మే 22 : బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సీఎం కప్-2023 క్రీడా పోటీలను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్, మన్నె క్రిశాంక్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ క్రీడకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపును ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 16 వేల క్రీడాప్రాంగణాలు.. 68 స్టేడియాలను నిర్మించామని, మరి కొన్ని స్టేడియాలు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడాపోటీల్లో ఆడిన క్రీడకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు నగదు పురస్కారాలను ఇచ్చినట్లు చెప్పారు. దీంతో పాటు ఉద్యోగాల్లో 2 శాతం, విద్యలో 0.5 శాతం రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు. ఏడాది నుంచి సీఎం కప్-2023 పోటీలు ప్రారంభం అయ్యాయని, ఈ క్రీడా పోటీలు ప్రతి సంవత్సరం ఉంటాయని పేర్కొన్నారు. 28 నుంచి 31వరకు ఈ పోటీలు కొనసాగుతాయని, 29వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలు ఎల్బి స్టేడియంలో జరగనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడకారులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. సీఎం కప్-2023 పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన క్రీడకారులను వెలికి తీయాలనే సంకల్పంతో సీఎం కప్-2023 క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ లక్ష్మి, హైదరాబాద్ జిల్లా క్రీడలు, యువజన అధికారి సుధాకర్, సికింద్రాబాద్ తహసీల్దార్ శైలజ, అర్జున అవార్డు గ్రహీత అనూప్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరికఆనంద్ బాబు, బీఆర్ఎస్ నాయకులు శ్రీగణేశ్, జి. ప్రభాకర్, ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, పెద్దాల నర్సింహ్మ, రావుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరుగుతున్న సీఎం కప్-2023 క్రీడ పోటీల్లో పాల్గొనే 1500 మందికి క్రీడాకారులకు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ భోజన సౌకర్యాన్ని అందించారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ క్రీడాకారులకు క్రీడా పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.