జవహర్‌నగర్, మే 11: తెలంగాణ సర్కారు బడుల్లో చదివన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని మేయర్ మేకల కావ్య అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే టాపర్స్‌గా నిలవడం అభినందనీయమని మేయ ర్ తెలిపారు. గురువారం మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 40లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు.
గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో టాపర్స్‌గా నిలిచిన ఆర్. యశ్వంత్(9.8), వి. రవిశంకర్(9.8), ఎస్తర్ రాణి(9.7 జీపీఏ) సాధించగా వారిని సన్మానించి ఒక్కొరికీ రూ. 10వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జవహర్‌నగర్ పాఠశాలలో 76 శాతం, బాలాజీనగర్ పాఠశాలో 60శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గండి రాంచందర్, లావణ్యసతీశ్గౌడ్, కో-ఆప్షన్‌సభ్యురాలు శోభారెడ్డి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖరయ్య, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.