మేడ్చల్, డిసెంబర్ 11: ఎరువులు, క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడటం చేటని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం పొన్నాలలో బుధవారం కూరగాయలు పండించే రైతులతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఎరువులు, క్రిమిసంహారక మందులు మోతాదు మించి వాడితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని రైతులకు సూచించారు. దీంతో దీర్ఘకాలంలో భూసారం తగ్గిపోతుందన్నారు. పొన్నాల, బాబాగూడ గ్రామాలను దత్తత తీసుకొని, ఉద్యాన విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని చెప్పారు.
సాగులో ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులందరూ కలిసి ఎఫ్‌పీవోగా ఏర్పడి, రాయితీలు, వివిధ ప్రోత్సాహకాలను పొందాలని ఆయన సూచించారు. జనవరిలో సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కిసాన్ మేళాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా తీగజాతి కూరగాయల సాగులో యాజమాన్య పద్ధతులు, వైరస్లు, తెగుళ్ల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, పరిశోధనా సంచాలకుడు డాక్టర్ లక్ష్మినారాయణ, జోనల్ హెడ్ డాక్టర్ సురేశ్‌కుమార్, కూరగాయల పరిశోధన హెడ్ డాక్టర్ అనిత, డీహెచ్‌ఎస్‌వో శ్రీధర్, ఉద్యాన అధికారులు శిల్ప, డాక్టర్ నిఖిల్, పొన్నాల, బాబాగూడ, అద్రాస్పల్లి రైతులు పాల్గొన్నారు.