GHMC | సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ ) : నాలా పూడికతీత పనులు మే నెలాఖరు నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే వర్షాకాలం వచ్చి.. జూలై ముగుస్తున్నా.. నేటికీ పనులు కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గ్రేటర్లో నాలా పూడికతీత నిరంతర ప్రక్రియ అని జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలాల్లో ఫ్లోటింగ్ మెటీరియల్తో నిలిచిన నీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా నియంత్రణకు పూడికతీత పనులను ఏటా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రీ మాన్సూన్, మాన్సూన్ సందర్భంగా, పోస్ట్ మాన్సూన్లో చేపట్టిన చర్యల్లో భాగంగా డీ సీల్టింగ్ ప్రక్రియతో పాటు వర్షంతో దెబ్బతిన్న వాటికి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. జీహెచ్ఎంసీవ్యాప్తంగా మొత్తం వరద కాలువ 1302 కిలోమీటర్లు ఉండగా, అందులో 390 కిలోమీటర్లు మేజర్ నాలా ఉంటుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 56.38 కోట్ల అంచనా వ్యయంతో 201 పనులు 919 కిలోమీటర్ల వరద కాలువను 952.69కిలోమీటర్ల పూడికతీత లక్ష్యంలో.. ఇప్పటి వరకు 781.42 కిలోమీటర్ల మేర పూర్తయినట్లు చెప్పారు. 3.3 లక్షల క్యూబిక్ మీటర్ల ఫ్లోటింగ్ మెటీరియల్ను తొలగించి, 85.73 శాతం పూర్తి చేశామన్నారు. అందులో 72.41 శాతం పూడికతీత మట్టిని జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు తెలిపారు.