హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి తలసాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తలసాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతులు..
అగ్నిప్రమాదంలో మరణించినవారిని ఆరుషి జైన్ (17), షీతల్ జైన్ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్ (13), అభిషేక్ మోడీ (30), రాజేంద్ర కుమార్ (67), ఇరాజ్ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్ (36), వర్ష (35), రజని అగర్వాల్ (32), రిషభ్ (4), ప్రీతం అగర్వాల్ (1)గా గుర్తించారు.