అమీర్పేట, మార్చి 1 : ప్రతి వేసవి కాలంలో బాటసారులకు స్వాంతన కలిగించేందుకు పెరుగన్నం, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోడల్ కాలనీకి చెందిన మానవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పెరుగన్నం, మజ్జిగ, మంచినీటి పంపిణీ శిబిరాన్ని కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. మానవ సేవ ట్రస్టు ప్రతినిధులు గత దశాబ్ద కాలంగా వేసవిలో బాటసారులకు మిత భోజనాలు అందిస్తుండటమే కాకుండా… శ్రేష్టమైన మజ్జిగతో పాటు మంచినీటిని అందిస్తుండటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ శిబిరం కొనసాగే 90 రోజులపాటు ప్రతిరోజు 300 మందికి పెరుగన్నం, 600 మందికి మజ్జిగతో పాటు చలివేంద్రం నిరంతరాయంగా కొనసాగుతుందని మేనేజింగ్ ట్రస్టీ దండా బుచ్చిబాబు ఎమ్మెల్యే తలసానికి వివరించారు. కేవలం వేసవిలోనే కాకుండా దాతల చేయూతతో పలు ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఎప్పటికప్పుడు ఉచిత భోజనాలు అందిస్తుండటం ఎంతో గొప్ప కార్యక్రమమని ట్రస్టు ప్రతినిధులు డి. బుచ్చిబాబు, రవీంద్రబాబు రవీంద్రబాబు శశికాంత్ మాచర్ రావులను తలసాని ప్రత్యేకంగా అభినందించారు.