కవాడిగూడ, మే 23: కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప.. పేద ప్రజల సమస్యలు పట్టవని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని విమర్శించారు. సెంట్రింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా శనివారం రెండో రోజుకు చేరుకున్నది. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వివేకానంద్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో సెంట్రింగ్ పనిపై ఆధారపడి దాదాపు పది లక్షల మంది జీవనం సాగిస్తున్నారన్నారు. సెంట్రింగ్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడినా వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వివేకానంద్ మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. నిరసనలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.కృష్ణ, చైర్మన్ పరుశురాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
