హైదరాబాద్: తనను కాకుండా మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంటే అతడిని చంపేస్తానంటూ ఓ యువకుడు తన మాజీ ప్రేయసిని బెదిరించాడు. సనత్‌నగర్‌లోని ఫతేనగర్ ఎల్బీఎస్ నగర్‌కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఇదే అదనుగా ఆమెను వేధించసాగాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు విషయం చెపడ్డంతో వారు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా మళ్లీ కలవబోమని ఇరువురూ అంగీకరించారు.
ఈ క్రమంలో యువతికి ఇటీవల పెండ్లి కుదిరింది. మరికొన్ని రోజుల్లో వివాహం ఉండగా.. ఈ విషయం తెలసుకున్న రవికుమార్.. పెండ్లి కొడుకుకు ఫోన్ చేసి గతంలో తాము ప్రేమించుకున్నామని, ఆమె గురించి చెప్పాడు. అంతటితో ఆగకుండా యువతికి ఫోన్ చేసి తనను కాకుండా మరొకరిని పెండ్లి చేసుకుంటే అతడిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.