బంజారాహిల్స్, డిసెంబర్ 22: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్ బస్తీలో నాలుగురోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో ఆస్తి కోల్పోయిన బాధితులకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 19న దుర్గాభవానీనగర్ బస్తీలోని ఓ ఇంటిపైన వేసుకున్న గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని నాలుగు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. బాధితులను ఆదుకోవాలని జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ అదేరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కోరారు.
దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్నిప్రమాదంలో నష్టపోయిన నాలుగు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. వారంరోజుల్లోగా బాధితులకు చెక్కులు అందిస్తామని పేర్కొన్నారు. తక్షణ సాయం కింద ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.