Akhil | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అఖిల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు గత మూడు సంవత్సరాల తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖిల్, ఏజెంట్ విడుదలైన మూడు నెలల తర్వాత జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు. ప్రమాదవశాత్తూ బాత్రూమ్లో జారి పడడంతో ఎడమ చేతికి గాజు ముక్కలు గుచ్చుకుని తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఆ గాయం కారణంగా ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని, మొత్తం 48 కుట్లు పడ్డాయని చెప్పారు. ఈ ప్రమాదం తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
గాయం తీవ్రత కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు బరువులు కూడా ఎత్తలేకపోయానని అఖిల్ వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి సుమారు 16 నెలలు పట్టిందని చెప్పారు. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు కొత్త సినిమా రాకపోవడంతో అభిమానులు తనపై అసంతృప్తిగా ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయితే ఇకపై ఇంత పెద్ద గ్యాప్ రాకుండా చూసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. తన కొత్త చిత్రం ‘లెనిన్’ గురించి మాట్లాడుతూ, కథ మొదటిసారి వినగానే ఎంతో కొత్త అనుభూతి కలిగిందని అఖిల్ చెప్పారు. కథలోని భావోద్వేగాలు, పాత్ర తీరు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు వెల్లడించారు.
ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ‘ఏజెంట్’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం, అనంతరం జరిగిన ప్రమాదం కారణంగా అఖిల్ కెరీర్లో అనుకోని విరామం వచ్చింది. ఇప్పుడు ‘లెనిన్’తో ఆయన బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రం అఖిల్‌కు ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.