సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): యూఎస్ఏలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అడ్మిషన్ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 3.25కోట్లు వసూలు చేసి మోసం చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. మాదాపూర్ ప్రాంతానికి చెందిన చాట్ల సంజీవ్‌కుమార్ తన కుమారుడికి యూఎస్ఏ, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన పాలడుగు రఘురామ్ అతడి భార్య సునీత సంజీవ్‌కుమార్‌కు పరిచయమయ్యారు.
తమకు యూఎస్ఏలోని వైట్‌హౌస్‌లో తెలిసిన వారున్నారని వారి ద్వారా కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో యూజీసీ కోసం అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రఘురామ్ దంపతులు నమ్మించారు. ఇందులో భాగంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినట్లు నకిలీ పత్రాలను సృష్టించారు. ఇందుకోసం సుమంత్ పేరుతో మరో సిమ్‌కార్డు ద్వారా ఒక వాట్సాప్ చాట్ సృష్టించాడు. సుమంత్ అనే వ్యక్తి వైట్‌హౌస్‌లో పనిచేస్తాడని, అతను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తాడని, నకిలీ అడ్మిషన్ పత్రాలు చూపించి రూ.3.25కోట్లు వసూలు చేశాడు. బాధితులను నమ్మించేందుకు మైసూర్ వెళ్లిన రఘురామ్ దంపతులు యూఎస్ఏ వెళ్లినట్లు చెప్పడమే కాకుండా అక్కడ సుమంత్‌ను కలిసినట్లు నమ్మబలికారు.
బాధితులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు సుమంత్ పేరుతో సంజీవ్‌కుమార్‌కు మెసేజ్‌లు పంపించాడు. రఘురామ్ తనను యూఎస్ఏలో కలిశాడని, అడ్మిషన్‌కు సంబంధించిన ప్రక్రియ జరుగుతుననట్లు ఆ చాట్‌లో పేర్కొన్నాడు. కాని రఘురామ్ పంపించిన అడ్మిషన్ పత్రాలపై అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఈవోడబ్ల్యూ పోలీసులు శనివారం రఘురామ్, అతడి భార్య సునీతలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. రఘురామ్‌పై గతంలో కూడా కూకట్పల్లి పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు డీసీపీ కె.ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సమరం రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.