మేడ్చల్, మే 14 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సోమవారం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లను నియోజకవర్గ జనరల్ పరిశీలకురాలు ప్రియాంక శుక్లా, జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ పలు రాజకీయ పార్టీల ఏజెట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో సీల్ వేసి సీజ్ చేశారు. హోలీమేరి కళాశాల, సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి హోలీమేరి కళాశాల, ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి వెస్లీ కళాశాలలో భద్రపరిచినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత, 24 గంటల పాటు సీఆర్పీఎఫ్ నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.