Gurukula School | ఘట్కేసర్, మార్చి 10: అది1938వ సంవత్సరం. ఘట్కేసర్ పట్టణంలో ఎంతో ఉన్నత ఆశయంతో గురుకుల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీ బన్సీలాల్ వ్యాస్ జీ ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా వేలాది మంది విద్యార్థులతో గురుకుల్ విద్యాలయం కళకళలాడింది. బన్సీలాల్ వ్యాస్ జీ పేద విద్యార్థుల కోసం ఉచిత హాస్టల్‌ను ఏర్పాటు చేయడమే కాక విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు 100కు పైగా ఆవులను సైతం కొనుగోలు చేసి గోశాలను ఏర్పాటు చేసి నిస్వార్థంగా సేవ చేశారు.
వీరి గొప్పతనాన్ని చూసి ముందుకొచ్చిన దాతలు అప్ప ట్లో నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో 627 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో 4 ఎకరాల భూమిని సేకరించి 1951 సెప్టెంబర్ 7న గురుకు ల్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఘట్కేసర్లో పాఠశాల నిర్వహణ కోసం 26 ఎకరాల భూమిని సేకరించారు. తన భార్య నగలు కూడా అమ్మి విద్యాలయ అభివృద్ధికి త్యాగం చేశాడు బన్సీలాల్ వ్యాస్ జీ. నిజాం ప్రభుత్వ తీరును నిరసించి జైలు జీవితం కూడా అనుభవించాడు.
అంతటి వ్యక్తి 1956 సెప్టెంబర్ 1న జరిగిన రైలు ప్రమాదాంలో మృతి చెందాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన అనేక మార్పుల వల్ల సంస్థ పూర్వ వైభవం కోల్పోయింది. సంస్థకు చెందిన ట్రస్టు సభ్యులు నగరంలో ఉన్న 627 ఎకరాల భూమిలో 100 ఎకరాలకు పైగా అమ్మకాలు జరిపి గోల్మాల్ చేయటంతో గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ట్రస్టును రద్దు చేసి పాఠశాల, కళాశాల పోషణార్థం, భూముల నిర్వహణ మొత్తం దేవాదాయ శాఖకు అప్పగించింది.
1989లో గురుకుల్ పాఠశాల, కళాశాల, సంస్థకు చెందిన భూ ములను దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ సంస్థ ఎదుగుదలను పట్టించుకోక గాలికి వదిలివేయటంతో సంస్థ వినాశనానికి దారి తీసింది. ఉపాధ్యాయులు, లెక్చరర్లు పదవీ విరమణ కాగానే నియామకాలు చేపట్టలేదు. సంస్థల మౌలిక వసతుల కల్పన జరుగలేదు. దీంతో విద్యార్థుల చేరిక లేకుండా పోయింది. కళాశాల కనుమరుగయ్యే పరిస్థితి నెలకొనటంతో పూర్వ విద్యార్థులు కొంత మంది కలుగుజేసుకుని తరగతి గదులు, కొంత మేర ఫర్నీచర్‌ను సమకూర్చారు. కాని దేవదా య శాఖ మాత్రం స్పందించలేదు.
గురుకుల్ సంస్థలోకి వెళ్లగానే పురాతన భవనాలు దర్శనమి స్తాయి. దయ్యాల కొంపగా వెలుగొం దుతున్నాయి. రాత్రిపూట విద్యుత్ సరఫరా ఉండదు. కాపలదారుడు ఉండకపోవటంతో పోకిరీలు డ్రగ్స్, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
సంస్థకు చెందిన భూముల విలువ వెలకట్టలేనివి. నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నభూములకు రూ.50వేల కోట్లకు పైగా విలువ ఉంటుంది. నాందేడ్‌లో 4 ఎకరాలు, ఘట్కేసర్ లోని 26 ఎకరాల భూమికి గాను 3 ఎకరాల భూమిని రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి వాడుకున్నందుకు గాను రూ.4 కోట్ల నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
హైటెక్ సిటీ వద్ద సంస్థ భూమిలో ఉన్న పెట్రోల్ బంక్‌ల నుంచి అద్దె నెలకు రూ.3.5 లక్షల ఆదాయం వస్తుంది.అంత ఆదాయం ఉన్న గురుకుల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగతలేదు.సంస్థకు చెందిన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉన్నా, నెలసరి ఆదాయం వస్తున్న గురుకుల్ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవటంతో విద్యాలయం నిర్వీర్యమైంది. ఆస్తుల పరిరక్షణకు చర్యలు లేవు, విద్యార్థుల బోధనకు ఉపాధ్యాయులు లేరు. తరగతి గదులకు భవనాలు లేవు.
ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న గురుకుల్ విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పూర్వ విద్యార్థులు ముందు కొచ్చి ప్రభుత్వ అధికారులు, సీఎం,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రాధేయపడుతున్నారు. అయినా ఎవరు స్పం దించక పోవటంతో గురుకుల్ పూర్వ విద్యార్థి అబ్బసాని యాద గిరి యాదవ్ సేవ్ గురుకుల్ నినాదంతో ఉత్తరాల ఉద్యమాన్ని చేపట్టి పూర్వ విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల కమిష నర్లు, తహసీల్దార్ వరకు నిత్యం సేవ్ గురుకుల్ పేరిట ఉత్తరాలను పోస్టు చేస్తు విన్నవిస్తున్నారు.
గురుకుల్ సంస్థను దేవాదా య శాఖ 1989లో స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే సంస్థ ప్రమాదంలో పడింది. ఏనాడు పట్టించుకోలేదు. నిధు లు మంజూరు చేయలేదు. నియమకాలు చేపట్టలేదు. సంస్థ నిర్వీర్యానికి ప్రధాన కారణమే దేవాదాయ శాఖ. తక్షణమే వైదొలిగి గురుకుల్ విద్యాలయ సంస్థను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. పట్టణంలో ఉన్న బాల, బాలికల ఉన్నత పాఠశాల లను గురుకుల విద్యాలయం ఆవరణలోకి తీసుకువచ్చి విద్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేయాలి.
-మాజీ సర్పంచ్, పూర్వ విద్యార్థి అబ్బసాని యాదగిరి
గురుకుల్ వ్యవస్థాపకుడు బన్సీ లాల్ వ్యాస్ జీ ఉన్నత ఆశయంతో చక్కటి భవనాలు నిర్మించి సంస్థను స్థాపించాడు. దేవాదాయ శాఖ ఆధీ నంలోకి తీసుకున్న తర్వాత ఆలనా పాలనా లేక భవనాలు శిథిలావస్థ లోకి చేరుకున్నాయి. ఏనాడు అధి కారులు, ప్రజాప్రతినిధులు పట్టిం చుకో లేదు.సంస్థ నిర్వీర్యం అవుతుంటే చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టి గురుకుల్కు పూర్వ వైభవం కల్పించాలి.
-పూర్వ విద్యార్థి కంది ప్రేమ్ కుమార్
ఘట్ కేసర్, మార్చి 10: గురుకుల్ విద్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉత్తరాల ఉద్యమాన్ని కొనసాగిస్తామని గురుకుల్ పూర్వ విద్యార్థి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ విద్యాలయాన్ని అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని సేవ్ గురుకుల్ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఉత్తరాల ఉద్యమం 36వ రోజుకు చేరుకుంది. సోమవారం పూర్వ విద్యార్థి సూర్యదేవ్ మోరే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉత్తరాలను పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రేమ్ కుమార్, సార శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ కుమార్ యాదవ్, ఇమ్మూ తదితరులు పాల్గొన్నారు.