మెహిదీపట్నం, నవంబర్ 26: నగరంలో వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతుందని, దీని వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నదని, ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. మంగళవారం నగరంలోని టోలిచౌకీ నుంచి షేక్‌పేట్ వరకు ఉన్న ప్రధాన రోడ్డులో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ రోప్’ను సీపీ సీవీ.ఆనంద్ ప్రారంభించి మాట్లాడారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలను అడ్డుకోవడం, తొలగించడం, అక్రమ పార్కింగ్‌లను నివారించడం.. ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలను ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి చేసే వ్యాపారాలను తాము ఉపేక్షించబోమన్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో పెరుగుతున్న వాహనాల కారణంగా నగర ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని చెప్పారు.
వాహనాల రద్దీ పెరగడంతోపాటు ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే ట్రాఫిక్‌కు ప్రధాన కారణాలని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సీపీ సీవీ.ఆనంద్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్లు సుధాకర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.