RTO | మన్సురాబాద్, మే 17: ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్, కాలేజ్ బస్సుకు ఫిట్నెస్ టెస్టు తప్పనిసరి అని ఈస్ట్ జోన్ ఆర్టీవో ఎల్. కిష్టయ్య తెలిపారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, కార్యదర్శి సి. రమేష్ ఆదేశాల మేరకు మలక్పేట్ ఆర్టీవో ఎల్. కిష్టయ్య ఆధ్వర్యంలో ఆర్టీఏ ఈస్ట్ జోన్ నాగోల్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం స్కూల్, కాలేజ్ బస్సుల యాజమాన్యం, డ్రైవర్లకు బస్సు ఫిట్నెస్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టీవో కిష్టయ్య మాట్లాడుతూ.. ప్రతి స్కూలు, కాలేజీ బస్సులను ఫిట్నెస్గా ఉంచుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బస్సులను నడపాలని.. అతివేగంతో నడిపి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఆర్టిఏ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐలు ఎం. బలరాం, ఆర్. రమేష్ బాబు, ఆర్. నరేందర్ పాల్ సింగ్, ఆర్. రాధిక పాల్గొన్నారు.