ఖైరతాబాద్, ఏప్రిల్ 24:నిమ్స్‌లో భద్రతా వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చిన పటాకుల కేసును కొందరు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైద్యాధికారి దానిని అబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అదే హోదాలో ఉన్న మరో వైద్యాధికారి అది నిజమంటూ సాక్షాధారాలను సైతం నిమ్స్ యాజమాన్యం, పోలీసుల ముందు ఉంచారు. స్వయంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, పూర్తి స్థాయిలో సాక్షాలను ముందుంచినా.. ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఎందుకు ఆదేశించడంలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ కేసును కొందరు అమాయకులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు జరుగుతున్నది. మరో వైపు ఈ కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసులపై పలు రకాల ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన కొందరు నిమ్స్ వ్యవహారంలో తలదూర్చి బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఆ గంటలోనే మారిన సీన్
నిమ్స్ దవాఖానలో అగ్ని ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత పంజాగుట్ట పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఐదో అంతస్తులోని ఓ వైద్యాధికారితో పంజాగుట్ట పోలీసు అధికారి ఒకరు గంట సేపు అతని గదిలో విచారణ పేరిట మాట్లాడారు. కేసులో అనేక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.అంతలోనే పటాకులు మాయం కావడం, ఆరోగ్యశ్రీ కార్యాలయం సిబ్బందిని అనుమానించడం, కేసు పోలీస్‌స్టేషన్‌కు చేరడం చకచకా జరిగిపోయాయి. వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది. పటాకులు ఎందుకు మాయమయ్యాయి. కేసు ముందుకు ఎందుకు సాగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమ్స్ దవాఖాన ప్రతిష్టను కాపాడేందుకు ఓ అధికారి ధైర్యం చేసి యాజమాన్యం, పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరూ పట్టించుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పటాకుల వెంట ఉన్న సూట్ కేసులు ఎక్కడ?
నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పటాకులతోపాటు దాని పక్కనే పెద్దపెద్ద సూట్ కేసులు దర్శనమిచ్చాయి. పటాకులతోపాటు సూట్ కేసులు సైతం మాయమయ్యాయి. అసలు ఆ సూట్ కేసుల్లో ఏముంది? ఎక్కడ దాచారు.. ఎవరు దాచారు.. ఎందుకు దాచారో.. తేలాల్సి ఉందంటున్నారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచిన నిమ్స్ దవాఖానలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా కేసును పారదర్శకంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.