సిటీబ్యూరో: వర్షాకాలం వేళ ఈవీడీఎం విభాగం, పోలీసులు సమన్వయంతో పనిచేసి నగరంలో వర్షం నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకుందామని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లపై వర్షం నీరు నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై ట్రై కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీసుల అధికారులతో బుధవారం రంగనాథ్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధిక వర్షపాతం నమోదైనప్పుడు ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో పాటు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిల్వకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించడం వంటి అంశాలపై చర్చించారు. కమిషనర్ రంగనాథ్ గాజులరామారంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. సర్వే నంబర్ 299, 300, 301, 298, 295లలోని భూములను పరిశీలించారు.