మేడ్చల్, మే 12: సీఎం రేవంత్ రెడ్డి ఓ సైకో, శాడిస్టు అని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడ్చల్లోని తన స్వగృహంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈటల సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని అన్నానని, నిరుపేదలు రెక్కలు ముక్కలు చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను కూల్చొద్దని కోరితే ‘ఎవరి మాట వినను, నేను అనుకున్నదే చేస్తాను’ అని అంటే సైకో కాకపోతే ఏమి అనాలన్నారు.
మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదన్నారు. పరిపాలనా మీద రేవంత్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయారని విమర్శించారు. అలవికానీ హామీలు ఇచ్చి, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాగా..కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా తీరును విమర్శిస్తూ ఎంపీ ఈటల చేసిన వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ సోమవారం ఈటల ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా ఆయన ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఈటల ఇంటివైపు రాగా పోలీసులు అడ్డుకొని దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.