
సుల్తాన్‌బజార్, నవంబర్ 26 : ఉత్తమ డివిజన్‌గా పేరుగాంచిన విజయనగర్ కాలనీలో ఇక చెత్త రోడ్లపై కనిపించదు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వ్యర్థాలతో ఆ ప్రాంతం దుర్వాసన వెదజల్లేది. మల్ల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ లేన్ ఎంప్లాయిమెంట్ కార్యాలయం ముందున్న ఫుట్‌పాత్‌ను మెరుగుపర్చి ఆ ఫుట్ పాత్‌పై స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12 స్టాల్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ, జలమండలి అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 5వ తేదీన ఈ స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ జోన్‌ను నాంపల్లి ఎమ్మెల్యే ప్రారంభిస్తారని జీహెచ్ఎంసీ ఏఈ మహేశ్ తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్ గోడలపై ప్రత్యేక పేయింటింగ్ వేయనున్నట్లు తెలిపారు. విజయనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన, దేవుని కుంట శ్మశాన వాటిక, శాంతి నగర్‌లోని వెట్ హోం ప్రహరీకి ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌లే చెత్త కేంద్రాలుగా విలసిల్లాయి. ఇక మీదట ఇవి కనుమరుగు కానున్నాయి. చెత్త వేసేందుకు వీలు లేకుండా కొన్ని ప్రాంతాలను గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ జోన్లుగా ఏర్పాటు చేయాలనే దిశగా పనులను ముమ్మరం చేస్తున్నారు.