మేడ్చల్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): “హైదరాబాద్ మహా నగరానికి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో అభివృద్ధి సైతం అత్యంత వేగంగానే అందుతున్నది. జిల్లాలో 11 వేలకు పైగా పరిశ్రమలు ఉండి 2,26 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఐనప్పటికీ ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పరిశ్రమలను నెలకొల్పేందుకు సన్నద్ధం అవుతున్నది. స్థానికులు, యువతకు మరింతగా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.”
హైదరాబాద్ మహా నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పరిశ్రమలకు ఏర్పాటుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటుకు అనువైన భూములను ఇటివలే అధికారులు గుర్తించారు. ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు, ప్రధానంగా జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయలు సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అనువైన భూములను జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించి నివేదికలను సిద్ధం చేశారు. అయితే, ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు అనుకున్న మేరకు స్థలం లభించనట్లయితే ప్రైవేట్ భూములను గుర్తించి మార్కెట్లో ఉన్న ధరలను పొందుపరిచి రెండు నివేదికలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గుర్తించిన భూముల చిత్రాలు (లోకేషన్ మ్యాపులను తయారు చేసి టీఎస్ఐఐసీకీ త్వరలోనే జిల్లా అధికార యంత్రాంగం పంపించనుంది. నగరానికి శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి, వందలాది పరిశ్రమలను నెలకొల్పి అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
జిల్లాలో ప్రభుత్వ భూములు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 5,195 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులలో ఉంది. అనువుగా ఉన్న ప్రభుత్వ భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వ భూమిని సంరక్షించినట్లె కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు వీలువుతుందన్న ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు యోగ్యంగా ఉన్న భూములను గుర్తించి నివేదికలను సిద్ధం చేయగా టీఎస్ఐఐసీ భూములను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోనుంది.
పరిశ్రమల ఏర్పాటుకు అనేక దరఖాస్తులు…
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. టీఎస్ఐఐసీలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 524 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి యేటా నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాలను ముందుగానే ఎంపిక చేసి సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుంది. జిల్లాలో మైక్రో, స్మాల్, మధ్య తరహా, భారీ పరిశ్రమలు 11,011 ఉండగా, ఇందులో 2,26,939 మందికి వివిధ హోదాలలో ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహంతో పాటు త్వరితగతిన మంజూరీలు ఇస్తున్న క్రమంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇటీవలే మేడ్చల్ జిల్లా మాదారంలో 171 ఎకరాలలో త్వరలోనే ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుంది. 171 ఎకరాలలో సుమారు 2 వందలకు పైగా నూతన పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.