సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అభివృద్ధిలో యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(ఉమ్టా) కీలక పాత్ర పోశిస్తూ.. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో ఎంతో ముందంజలో ఉన్నది. అందుకు తాజా నిదర్శనం.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పట్టణ రవాణా వ్యవస్థల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(ఉమ్టా) తరహాలోనే బెంగళూరులో మెట్రోపాలిటన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పనలో ఉమ్టా కీలకంగా మారుతున్నది.
బెంగళూరులోనూ ఇదే విధానం
ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్న కొద్ది వేగవంతమైన పట్టణీకరణ జరుగుతున్నది. ఈనేపథ్యంలో ఒక మహానగరానికి సంబంధించిన సమగ్ర పట్టణ ప్రణాళిక ఎంతో ముఖ్యమైంది. ఈ కోవలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని ఏర్పాటు చేసి ప్రణాళిక బద్దమైన పట్టణీకరణ జరిగే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు హాట్ టాఫిక్‌గా మారడంతో పెట్టుబడులపైనా ప్రభావం చూపాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బెంగళూరు మెట్రో పాలిటన్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీని (బీఎంఎల్టీఏ) ఏర్పాటు చేశారు.
ఇక్కడ చూసి.. అక్కడ చేస్తున్నరు..!
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు ఉండగా, భవిష్యత్ పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 6285 చదరపు కి.మీటర్లుగా ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2031 హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ఉండగా, దాని స్థానంలో తెలంగాణ ప్రభుత్వం 2041 లక్ష్యంగా మరో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
దీని పరిధిలో పట్టణ రవాణా వ్యవస్థ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(ఉమ్టా) ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉన్న వాటితో అనుసంధానం జరిగే ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. రోడ్డు రవాణాతో పాటు ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఈబీఆర్టీఎస్ వంటి వ్యవస్థలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం పరిధిలో కల్పించేందుకు కార్యాచరణను రూపొందించింది. ఈ విధానాలను ఇతర మెట్రో నగరాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఇతర నగరాల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇక్కడి వచ్చి వెళ్తున్నారు. ‘తెలంగాణ చేసి చూపుతున్నది.. దేశం అనుసరిస్తుందన్న’ సీఎం కేసీఆర్ మాటలు నిజం చేసేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన బీఎంఎల్టీఏ ఉదాహరణగా చెప్పవచ్చు.