ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 23: ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో ఉన్న 1200 మంది రైతులకు ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని మాజీ ఎంపీపీ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో 80 శాతం రైతులకు రుణమాఫీ జరుగలేదని, వెంటనే రుణమాఫీ జేయాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్ నుంచి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార దాహంతో 420 అబద్దాలు చెప్పి.. ఓట్లు వేయించుకున్నారని, అధికారం వచ్చాక ప్రజలను మోసగించి హామీలను విస్మరించారని అన్నారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డైరెక్టర్ జిల్లాల పోచిరెడ్డి, రైతు సంఘం నాయకులు మహిపాల్ రెడ్డి, బాలరాజు యాదవ్, నర్సింహులు యాదవ్, మధుసూదన్‌రెడ్డి, వెంకట్ రెడ్డి, పద్మారెడ్డి, మల్లేశ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.