సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : తమ వాహనాలు 15 ఏండ్లు దాటాయి కాబట్టి ఇక తుక్కుకు పంపాలేమోనన్న దిగులు ఇక వద్దు. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అలాంటి పరిమితి ఏమీ లేదు. సాధారణంగా ఏ వాహనమైనా రోడ్లపై పయనించేందుకు 15 ఏండ్లు గడువు ఉంటుంది. ఆ గడువు మీరితే తుక్కుకు పంపే అవకాశం ఉంటుంది. అయితే అదే వాహనాన్ని వినియోగించుకోవాలనుకుంటే రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 5 ఏండ్ల వరకు ఆ వాహనానికి అనుమతి లభిస్తుంది. ఇలా అనుమతి లభించిన వాహనం 5 ఏండ్లు దాటినా మరోమారు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది.
ఇందుకోసం ప్రత్యేక మైన కాల పరిమితి అంటూ ఏమీ లేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వాహన గడువుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. 15 ఏండ్లు దాటితే తుక్కుకు పంపాలనే నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించారు. చాలా మంది నాన్ట్రాన్స్పోర్టు వాహనదారులు తమ వాహన గడువు ముగిసిందని బ్రోకర్లను ఆశ్రయించి డబ్బులు నష్టపోతున్నారని, వాహన సామర్థ్యం మేరకు ఎన్నేైండ్లెనా వాహనాన్ని రెన్యూవల్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
రెన్యువల్ను అధికారులు ధృవీకరించాలి
నాన్ట్రాన్స్పోర్టు వాహన సామర్థ్యాన్ని బట్టి దఫదఫాలుగా 5 ఏండ్లు రెన్యువల్ అవకాశం ఉంది. అయితే సంబంధిత వాహనాన్ని ఆర్టీఏ అధికారులు ధృవీకరించాలి. ఈ క్రమంలో ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలకు గ్రీన్ ట్యాక్సీ చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏండ్లు నిండిన ద్విచక్ర వాహనానికి సాధారణ ఫీజు 1435తో పాటు 2వేలు గ్రీన్ ట్యాక్సీ చెల్లించాలి. గడువు ముగిసిన రోజులకు అంటే నెలకు రూ.300 చెల్లించాలి. ఈ మొత్తం ఫీజు మీసేవలో సంబంధిత ఆర్సీతో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆధార్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఆర్సీ తదితర పత్రాలతో ఆర్టీఓ కార్యాలయంలో దాఖలు చేయాలి.
అనంతరం ఆ వాహనం మరో ఐదేండ్లు వినియోగించడానికి అనుమతి లభిస్తుంది. ఇదే లెక్కన 15 ఏండ్లు నిండిన ఫోర్ వీలర్ అయితే సాధారణ ఫీజు రూ.5,835తో పాటు గ్రీన్ ట్యాక్సీ రూ.5000లు ఉంటుంది. గడువు ముగిసిన పెనాల్టీ అంటే నెలకు రూ.500లు ఉంటుంది. ఈ మొత్తం ఫీజును మీ సేవలో చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోర్ వీలర్ 20 ఏండ్లు వినియోగించి ఉంటే గ్రీన్ ట్యాక్సీ రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో ఐదేండ్ల వరకు వాహనం వినియోగించే వీలు ఉంటుందని వివరించారు. గ్రేటర్లో 15 ఏండ్లు గడువు ముగిసిన వాహనాలను వెంటనే రెన్యువల్ చేయించుకోవాలంటూ అధికారులు సూచించారు.
గ్రేటర్లో కాలం చెల్లిన వాహనాలు ఇలా!
ద్విచక్ర వాహనాలు : 17 లక్షలు
కార్లు : 3.5 లక్షలు
గూడ్స్ క్యారిజెస్ : 1లక్ష
ఆటోలు : 20వేలు
ఇతర వాహనాలు : 9వేలు