SPDCL | సిటీబ్యూరో, మారి 30 (నమస్తే తెలంగాణ): మీటర్ కావాలంటే రూ.35 వేలు.. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే కెపాసిటీని బట్టి రూ.50 వేల చొప్పున రూ.3లక్షలు.. ఇవి డిపార్ట్మెంట్ నిర్ణయించిన ధరలు కావు. కొందరు అధికారులు డిసైడ్ చేసిన రేట్లు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రతి పనికో రేటు నడుస్తోంది. పని కావాలంటే ముందుగా పైసలు ఇవ్వాల్సిందే. లేదంటే ఆ ఫైలే ముందుకు పోదు. దక్షిణ డిస్కం పరిధిలో కొందరు విద్యుత్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ప్యానెల్ బోర్డులు బిగింపు మొదలుకొని మీటర్ల ఏర్పాటు వరకు అన్నీ తామే అయి వ్యవహరిస్తున్నారు. డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు ఒక పని చేయాలంటే తాము నిర్ణయించిన రేటు తమకు దక్కితేనే పనులు చేస్తూ లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల డి.పోచంపల్లి ఏఈ సురేందర్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
గత నెలలో కూడా గచ్చిబౌలి ప్రాంతంలో ఏడీఈ సతీశ్ అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ప్రధానంగా శివారుప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో పోస్టులకు భలే డిమాండ్ ఉంది. ఇక్కడ పోస్టింగ్ వస్తే ఆ అధికారి పంట పండినట్లేనని, అందుకోసం ఉన్నతాధికారులు, రాజకీయనాయకుల పైరవీతో పోస్టులు దక్కించుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులే చెబుతున్నారు.
ఫోకల్ పోస్టులకు భలే డిమాండ్!
లంచాల దందా పెరుగుతుందని ప్రతీ మూడేళ్లకోసారి దక్షిణ డిస్కంలో బదిలీలు జరుగుతుంటాయి. గచ్చిబౌలి, పటాన్చెరు, సైబరాబాద్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో చాలా పోస్టులను కీలకంగా భావిస్తూ వీటిని ఫోకల్ పోస్టులుగా పిలుస్తారు. గత ఏడాది జరిగిన బదిలీల్లో దాదాపు 40 ఫోకల్ పోస్టుల కోసం సిబ్బంది లక్షలు లంచాలిచ్చి దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్లో చర్లపల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులుగా భావిస్తారు.
వీటిని దక్కించుకోవడానికి ఎంత డబ్బులైనా అధికారులు వెనకాడడం లేదంటే, ఇక్కడ సైడ్ ఆదాయం ఎంతుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక శివారు ప్రాంతాల్లో ఉన్న పోస్టులకైతే లక్షల చెల్లించి మరీ పోస్టులు దక్కించుకున్నారని తెలుస్తోంది. తాము తెచ్చుకున్న పోస్టుల డిమాండ్ నేపథ్యంలో అంతే స్థాయిలో వినియోగదారుల అవసరాన్ని బట్టి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే వసూళ్లకు చెక్ పెట్టడానికి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన విద్యుత్ విజిలెన్స్ విభాగం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.
ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని బట్టి రేటు..
గ్రేటర్ శివారు పారిశ్రామిక ప్రాంతాల్లో అధికారులు ఆడిందే ఆటగా లంచాల దందా సాగుతోంది. కొత్త నిర్మాణాలు చేపట్టినా, పరిశ్రమలు ఏర్పాటుచేసినా వీరి పంట పండినట్లే. 20కిలోవాట్స్ కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు దృష్టిపెట్టి వారి అంచనాలకు సరిసమానం గా లంచాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోం ది. 63కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే శాఖాపరంగా సుమారు రెండున్నరలక్షలవుతుంది. కానీ ఏర్పాటు కోసం ఏడీఈ స్థాయి అధికారులు మొదలుకొని ఏఈ, డీఈ, లైన్మెన్ల వరకు లంచాలు ఇవ్వనిదే ఫైలు కదలడం లేదు.
100 కేవీ, 250కేవీ, 315 కేవీ, 500 కేవీ ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే అంచనాలతో పాటు అధికారులకూ రూ.50వేల చొప్పున 3లక్ష లు చెల్లించాలి. మరోవైపు అన్ని అనుమతులున్న భవనంలోని ఫ్లాట్లకు సింగిల్‌ఫేస్ మీటర్‌కు రూ.3200, త్రిఫేస్కు రూ. 8వేలు కట్టాల్సింది. అనుమతుల్లేని అంతస్తుల్లో మీటర్లు ఇప్పిస్తామంటూ సిబ్బంది డిమాండ్‌ను బట్టి మీటరుకు రూ.30 నుంచి 35వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు సదరు లంచగొండ్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్య ల ఊసే లేదని వినియోగదారులు వాపోతున్నారు.
కొన్ని డివిజన్లలో అక్రమ ట్రా న్స్ఫార్మర్లతో పాటు ప్యానెల్ బోర్డుల ఏ ర్పాటు మీటర్ల కేటాయింపులు జరుగుతున్నాయని సమాచారం. జీడిమెట్ల, మేడ్చ ల్, కొండాపూర్ డివిజన్లు, డీపీ పల్లి, గాజులరామారంలో కొంతమంది సిబ్బంది అం చనా లేకుండా ప్యానెల్బోర్డులు, విద్యుత్ మీటర్లు ఇస్తామంటూ అవినీతికి పాల్పడుతున్నట్లు దక్షిణ డిస్కం తీసుకొచ్చిన ఫిర్యా దు నబర్లకు మొత్తం 150కి పైగా ఫిర్యాదులొచ్చాయి. శివారు ప్రాంతాల్లోని కొన్ని డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చినా చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి.