రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉంటారు.. కానీ రాష్ర్టాన్ని తీసుకొచ్చి వన్నె తెచ్చిన ముఖ్యమంత్రులు మాత్రం చాలా అరుదు. అలా తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టింది నిస్సందేహంగా మన సీఎం కేసీఆర్. అందుకే తెచ్చిన రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి అభివృద్ధి, సంక్షేమమే రెండు కండ్లుగా సుపరిపాలన అందించి, తెలంగాణను దేశానికి మోడల్‌గా నిలిపిన కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కమలనాథుల అభివృద్ధిరహిత పాలన నుంచి దేశాన్ని రక్షించాలంటే ఉద్యమ ధీరుడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని నగరం లోని సబ్బండ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.
కుల, మత చిచ్చులతో దేశాన్ని నిలువునా ముంచుతున్న మతతత్వ శక్తులను గద్దె దించాలని, గంగాజమునా తెహజీబ్‌గా సుపరిపాలన అందించే కేసీఆర్ రావాలని నినదిస్తున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరుగలేదని ప్రజలు మండిపడుతున్నారు. గుజరాత్ మోడల్ అంటే అదానీ, అంబానీలు దోచుకునే మోడల్‌గా మారిందని, దేశం బాగుపడాలంటే సంపదను పెంచి పేదలకు పంచే కేసీఆర్ నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడులతో పాటు రైతును రాజు చేయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరని, దేశ రక్షణ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతున్నారు. దేశంలోని సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని, బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే ఆయనే దేశరాజకీయాలకు దిక్సూచి కావాలని పునరుద్ఘాటించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్‌గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాకుండా యావత్ దేశానికి అవసరమని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలంగాణ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు అధ్యక్షతన ‘సోషల్ మీడియాలో ఐటీ నిపుణుల పాత్ర’ అనే అంశంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సుపరిపాలనను అందిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. అలాంటి నాయకత్వంలో ప్రజలకు భద్రత, భరోసా, భవిత ఉంటుందని చెప్పారు.
ప్రధానంగా ఐటీ రంగంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటే ఎనిమిదేండ్లలోనే రెట్టింపు స్థాయిలో ఐటీ ఉద్యోగ అవకాశాలు రాగా, అదే స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. వీటికి తోడు జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు సైతం పెట్టుబడులతో హైదరాబాద్‌కు క్యూ కడుతున్నట్లు చెప్పారు. ఇంత చేస్తున్నా.. బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలను చేసే బీజేపీ విధానాల్ని తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ నిపుణులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎప్పటికప్పుడు ఎండగట్టేలా సోషల్ మీడియా ద్వారా తమ వంతు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లోనూ అమలు కావాలని, ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అలా జరగాలంటే కేసీఆర్ నాయకత్వం రాష్ర్టానికే పరిమితం కాకుండా దేశానికి అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సమావేశానికి హాజరైన ఐటీ నిపుణులు ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ ఫోరం ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, కిషన్‌రావు, ఐటీ నిపుణులు
దేశం మొత్తం అభివృద్ధి ఫలాలు
2014కు ముందు తెలంగాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ, కాకతీయతో సాగు, తాగునీటికి కరువులేకుండా చేశారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి..నిధులకు కొదువ లేకుండా అభివృద్ధి చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ సమస్య తీర్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ లక్ష్యం నెరవేరింది. గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అందుకున్న అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు కూడా అందాలి. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్.. భారతదేశానికి నాయకత్వం వహిస్తే.. ప్రపంచ పఠంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది.
– డాక్టర్ మార్త రమేశ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి
ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ నాయకులను ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు కావాలి. కాబట్టి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆయన ప్రత్యక్షంగా కేంద్రంలో కీలక భూమిక పోషించాలి.
– వెంకట్ రెడ్డి , పీఆర్టీయూ సైదాబాద్ మండల అధ్యక్షుడు