సాధారణ ఎన్నికలను తలపించేలా హడావుడి
ఈ నామినేషన్లు 21 వరకు నామినేషన్లు
వచ్చే నెల 7న ఎన్నికలు, 8న ఫలితాలు
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 18: ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఎన్నికలను నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల హడావుడిలో అంతగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తారు.
అధికారికంగా మూడు సంఘాలు
ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, ఓయూ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఓయూ ఎంప్లాయీస్ యూనియన్ల పేరుతో అధికారికంగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగుల హోదాలను బట్టి ఆయా సంఘాలలో సభ్యులుగా ఉంటారు. ఈ సంఘాలలో కేవలం పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఈ సంఘాలకు మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగతాయి. ఒక్కో సంఘం కార్యవర్గంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి,ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉంటారు.
విడుదలైన నోటిఫికేషన్
ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఓయూ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ చైర్మెన్‌గా, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరయ్య, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి సభ్యులుగా, ఎస్టాబ్లిష్మెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పరీశ్వర్ ప్రసాద్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. సోమవారం నుంచి గురువారం వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు కన్వీనర్ పరీశ్వర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే మంగళవారం వరకు గడువు విధించినట్లు పేర్కొన్నారు.
వచ్చే నెల 7న ఎన్నికలు
మూడు సంఘాల ఎన్నికలను వచ్చే నెల 7న నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. ఆదివారం ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.
ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓయూ ఉద్యోగ సంఘాలు
ఎన్జీవోస్ అసోసియేషన్‌లో 328 మంది ఉద్యోగులు ఓటు హక్కును కలిగి ఉండగా, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు.
ఓయూ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్‌లో 293 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలాఉండగా ఓయూ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల్లో 465 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.