హైదరాబాద్ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో జర్మనీ వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం ఎంపిక వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు ఈ నెల 28న 35 మందితో కూడిన విద్యాశాఖ అధికారుల బృందం జర్మనీ వెళ్తుండగా.. ఇందులో సాంకేతిక విద్యాశాఖ నుండి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. పలువురి ఎంపికపై ఆ శాఖలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నది.
ఏడుగురు సభ్యుల్లో ముగ్గురు అనర్హులే ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. రిటైర్డ్ ఇంగ్లిష్ లెక్చరర్, ఫిజిక్స్ హెడ్, సివిల్ వాళ్లు ఇద్దరు, డిప్యూటీ డైరెక్టర్, ఎలక్ట్రికల్స్ డిపార్టుమెంట్ నుండి ఒకరు ఉండగా.. అయితే ఇందులో ముగ్గురు అధికారులకు అర్హత లేదని, సంబంధిత రంగాలపై కనీస అవగాహన, అర్హత లేని వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారంటూ ఇతరు ఉద్యోగులు, సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే లూప్ హోల్స్ ద్వారా ఈ ముగ్గురిని చేర్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమై ఉంటుందా అని విద్యాశాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదివరకు ఫిన్లాండ్ టూర్కు పంపిన వారిలోనూ అనర్హులే ఉన్నారని, వారు ఇప్పటివరకు కూడా టూర్లో అధ్యయనం చేసిన విషయాలను బోర్డులో కనీసం చర్చించలేదని సమాచారం. ఈ విధంగా ఎస్బీటెట్ నిధులు దుర్వినియోగం చేయడం సరికాదని అధికారులు మండిపడుతున్నారు.