సిటీబ్యూరో/చార్మినార్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మొహర్రం సందర్భంగా డబీర్పురా దారుషిఫాలోని చారిత్రాత్మక బీబీకా ఆలవాను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మోహర్రం ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచే శ్రీదేవి ఏనుగు ట్రయల్వాక్ను ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వాహకులతో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మొహర్రం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ సిటీ పోలీసుశాఖ కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.
అందులో భాగంగా బీబీకా ఆలం ఊరేగింపు కోసం దాదాపు 2వేల మంది సిబ్బందితో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. భారీ జనసమూహం ఉన్నప్పుడు ఏనుగు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఊరేగింపు మార్గం ఎలా ఉంది, భద్రతాపరంగా ఎటువంటి అదనపు ఏర్పాట్లు చేయాలనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే ఈ ట్రయల్ రన్ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్, టాస్క్ఫోర్స్ డీసీపీ రఘునాథ్ గైక్వాడ్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే పాల్గొన్నారు.