అందరూ యువకులే.. అన్నీ పండుగ సంబురాల సందర్భాలే.. విద్యుత్‌శాఖ నిర్వహణ లోపాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఎనిమిది మంది ఆది, సోమవారాల్లో జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదాల్లో చనిపోయారు. వారి కుటుంబాలు ఒంటరిగా మారిపోయి గుండెలవిసేలా రోదిస్తున్నాయి. ఈ ఘటనలకు బాధ్యులెవరు. విద్యుత్‌శాఖ తమకేం సంబంధం లేదని చేతులెత్తేసినా.. నిర్వహణ లోపాలే కారణంగా ఈ మరణాలకు బాధ్యత కరెంట్ వారిదేనని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఎస్పీడీసీఎల్ చేస్తున్న కేబుల్ కటింగ్, ప్రభుత్వ ఆదేశాలపై విరుచుకుపడుతున్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీస సమయం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా వర్కింగ్ డేస్ లో కట్ చేస్తే ఉద్యోగాలు ఎలా చేసుకోవాలంటూ మండిపడుతున్నారు.
విద్యుత్‌శాఖ నిర్లక్ష్యధోరణి కారణంగా వెలుగులు పంచాల్సిన విద్యుత్ తీగలు సామాన్యుల ప్రాణాలు తోడేస్తున్నాయి. పలువురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. సరఫరాలో లోపాలు సవరించడంతో పాటు ప్రమాదకర పరిస్థితులను నివారించడంలో కీలక పాత్ర పోషించే ఈ నిర్వహణ వ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టమవడంతో దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో ప్రమాదాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. నిర్వహణ లోపాలు సరిదిద్దడానికి క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కార్యాచరణ రూపొందించాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. ఈ నెల మొదటివారం నుంచి అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో లైన్ టు లైన్, పోల్ టు పోల్ తిరిగినా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో చాలా కారణాలు అడ్డువస్తున్నట్లుగా ఒక సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఈ డ్రైవ్ కూడా అన్నిచోట్ల పూర్తి స్థాయిలో జరగలేదని సిబ్బందే చెబుతున్నారు. ఇరవై రోజులుగా డిస్కం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లోపాలను తెలుసుకుంటున్నప్పటికీ వర్షాల కారణంగా మూణ్ణాళ్ల ముచ్చటగానే ఈ డ్రైవ్ మారిపోయింది. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి సిబ్బంది వరకు నిర్లక్ష్యం వీడడం లేదు. మెయింటెనెన్స్ పేరుతో సీజన్ల వారీగా మూడు నుంచి ఐదు గంటల పాటు కరెంట్ నిలిపేసి పనులు చేపట్టినా నిర్వహణ లోపాలను సరిచేయకుండానే, చెట్ల కొమ్మలు కొట్టడం వరకే అధికారులు, సిబ్బంది పరిమితమవుతున్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు తప్ప ముందుగానే వీటిని గుర్తించి సరిచేసే వ్యవస్థే లేకపోవడం ప్రధాన లోపంగా ఉంది.
గత సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ మధ్యలో సెక్షన్ల వారీగా టీజీగెయిన్స్ పేరుతో సర్వే చేయించి దెబ్బతిని విరిగిన స్తంభాలు, కిందికి వేలాడుతున్న వైర్లు, లూజ్ కాంటాక్ట్‌లు, ఎలాంటి రక్షణ లేని డీటీఆర్లు, ఫ్యూజ్బాక్సులు, ఏబీ స్విచ్‌లు.. ఇలా 4.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఆ పనుల్లో కొన్ని మాత్రమే పూర్తి కాగా దాదాపు 80 శాతం పనులు అలాగే నిలిచిపోయాయి. దీనికి కారణం సరైన సమయంలో పనులకు కావలసిన సామాగ్రి అందకపోవడమేనని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. అంతే కాకుండా కాంట్రాక్టర్లకు అప్పగించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు కూడా కేబుల్ ఇవ్వకపోవడంతో అవి కూడా ఆగిపోయాయి. చెట్ల కొట్టివేతలో కూడా గతంలో పనిచేసిన వారెవరూ సరిగా ముందుకు రాలేదు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను నామమాత్రంగా చేశారు. అసలు సమ్మర్లో ఈ పనులన్నీ పూర్తి చేసి వర్షాకాలం వచ్చేసరికి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన డిస్కం అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసినందున వర్షాకాలంలో అడుగడుగునా సరఫరాలో అంతరాయాలు, ఫీడర్లు ట్రిప్ అవడాలు, లైన్లు తెగిపడడం, చెట్ల కొమ్మలు వైర్లను తగిలి ఉండడం వంటి చాలా సమస్యలు నగరవ్యాప్తంగా కాలనీల్లో కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్రమాదాలకు తాము కారణం కాదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా సమ్మర్లో చేయాల్సిన పనులు చేయకపోవడంతో పాటు సంవత్సరం కిందట గుర్తించిన లోపాలను ఇప్పటివరకు కూడా సరిదిద్దకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎండాకాలంలో క్షేత్రస్థాయిలో తిరిగి చేయాల్సిన పనులను వానాకాలంలో తిరగమంటే సాధ్యం కాదని, ఇప్పుడు పడుతున్న వర్షాలతో గ్రౌండ్లో సమస్యలు వస్తే వెంటనే వెళ్లి సరఫరా పునరుద్ధరించడం, లోపాలు సవరించడంపైనే దృష్టిపెట్టాల్సి వస్తున్నదని, దీంతో డ్రైవ్‌లో కరెక్ట్‌గా పాల్గొనలేకపోయామని కొందరు అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్ తీగల్లోని లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తీగల మధ్య ప్రమాణాల మేరకు ఖాళీలు వదలకపోవడం, డీటీఆర్‌ల వద్ద వదులుగా ఉన్న తీగల ప్రాంతంలో స్పార్క్‌తో మంటలు వస్తున్నాయి. మరోవైపు గాలి దుమారానికి, చెట్లకొమ్మలు తెగి వైర్లపై పడుతుండడంతో వర్షాకాలంలో తరచూ వైర్లు తెగిపడుతూ స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్ లైన్లు వేశాక వాటిని క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ పద్ధతిలో ఇష్టారీతిగా మార్చేస్తున్నారు. రెండు కండక్టర్ల మధ్య తగిన ఖాళీ లేకుండానే జరుపుతున్నారు. దీంతో గాలి వీచినప్పుడు రెండు తీగలు ఒకదానితో ఒకటి తాకి మంటలు వస్తున్నాయి. చెట్ల కొమ్మలు తాకినా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. స్తంభాలు, డీటీఆర్లు ఎక్కడ పడితే అక్కడ వదులుగా ఉన్న తీగల వద్ద స్పార్క్‌తో మంటలు వస్తున్నాయి. రెండు స్తంభాల మధ్య తీగలు వదులుగా ఉండొద్దని, అలాగని బిగుతుగా కూడా ఉండొద్దని.. ప్రమాణాల మేరకు తీగలను లాగాలని విద్యుత్ రంగ నిపుణులు చెప్పారు. కానీ సిబ్బంది అలాంటి నిబంధనలు పాటించకపోవడంతోనే చాలాచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిస్కం పరిధిలో లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజులైన్లు సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను ఛేంజ్ చేయడం, డీటీఆర్‌ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. మెయింటెనెన్స్ పేరుతో కంపెనీ కేటాయించిన నిధులను మింగేస్తున్నారు తప్ప సరఫరా వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడడం లేదు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎప్పటికప్పుడు లైన్ టు లైన్, పోల్ టు పోల్ తిరిగి ప్రమాదకరంగా ఉన్న వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్త వైర్లు, స్తంభాలు, పిన్ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా పెద్దగా పట్టించుకోవడం లేదు.