సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ సిటీ కంటే చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లోనే విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. సైబర్ సిటీ సర్కిల్, రాజేంద్రనగర్, మేడ్చల్, హబ్సిగూడ, సరూర్‌నగర్, సంగారెడ్డి సర్కిళ్లలో కొత్తగా నివాసాలతో పాటు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అయితే త్వరితగతిన విద్యుత్ కనెక్షన్లు మాత్రం జారీ చేయడం లేదు. ముఖ్యంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, వ్యక్తిగత గృహాలు కోర్ సిటీ కంటే శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువగా డిమాండ్ ఉంటోందని విద్యుత్ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. పెరుగుతున్న విద్యుత్ డి మాండ్‌కు అనుగుణంగా కొత్త నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఇంకా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేశామని చెబుతున్నారే తప్ప, క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టడం లేదు.