Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. మే నెలలో ఉండాల్సిన విద్యుత్ వినియోగం మార్చిలోనే రికార్డు స్థాయిలో నమోదైంది. రెండు రోజుల కిత్రం 81,78 మిలియన్ యూనిట్లుగా విద్యుత్ వినియోగం నమోదు కావడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. మార్చి-ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నాటికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వేసవి కార్యాచరణ పేరుతో ముందుగానే అవసరమైన విద్యుత్ యంత్ర సామగ్రిని సిద్ధం చేసుకొంది. వినియోగం పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఎండ వేడి ఒకవైపు, వత్తిడి మరోవైపు ఉండటంతో పేలిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని 220కేవీ సబ్ స్టేషన్లో రాత్రి 10 గంటల సమయంలో లోడ్ పెరిగి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సబ్ స్టేషన్లపై వత్తిడి పెరుగడంతో అక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో నార్సింగి, నానక్‌రాంగూడ పరిధిలోని రెండు చోట్ల , అలాగే రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనూ కొత్తగా రూ.1.20 కోట్ల విలువ చేసే పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
క్షేత్ర స్థాయిలో అందుబాటులో..
వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దని ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ముఖ్యంగా డిస్కం పరిధిలో గ్రేటర్‌లోనే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉండటంతో పాటు ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సర్కిల్ పరిధిలో ఉండే ఎస్ఈ స్థాయి అధికారి నుంచి మొదలు కొని ఏఈ, లైన్మెన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్లు క్షేత్ర స్థాయిలోనే ఉండి విద్యుత్ సరఫరాను తీరును పర్యవేక్షిస్తున్నారు. ఫీక్ అవర్‌లో డిమాండును పరిశీలించి..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే క్రేన్ల సాయంతో పవర్ ట్రాన్స్ఫార్మర్లను తీసుకొచ్చి బిగించి సరఫరా సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు.