సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారులు బిల్లుల చెల్లింపును సులభతరం చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీజీఎస్పీడీసీఎల్) సంస్థ చర్యలు చేపట్టింది. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో చాలా మంది అందుబాటులో ఉన్న మొబైల్ యాప్‌ల ద్వారానే తమ బిల్లులు చెల్లిస్తున్నారు.
గత జూలై నుంచి పలు కారణాలతో థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి టీజీఎస్పీడీసీఎల్ యాప్, వెబ్సైట్ ద్వారా కడుతున్నారు. అయితే లక్షలాది మంది వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లించేందుకు అలవాటుపడిన క్రమంలో సంస్థ యాప్, వెబ్సైట్ ద్వారా చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
డిస్కం పరిధిలో మొత్తం కోటికి పైగా విద్యుత్ వినియోగదారులు ఉండగా, అందులో 60 శాతం మంది ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌కు ప్రజలు ఎక్కువగా థర్డ్ యాప్‌లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఆదిశగా చర్యలు చేపట్టారు.ఆగస్టు నెలాఖరు నాటికి ఎంపిక చేసిన మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.